Fact Check : హైదరాబాద్ పోలీసు కమీషనర్ అంజనీ కుమార్ 92 మంది పోలీసులను సస్పెండ్ చేశారా..?
Hyd police chief did not suspend 92 officers. తెలుగు డైలీ పేపర్ మన తెలంగాణలో వచ్చిన వార్త సామాజిక మాధ్యమాల్లో వైరల్
By Medi Samrat Published on 5 Dec 2020 4:49 AM GMT
తెలుగు డైలీ పేపర్ మన తెలంగాణలో వచ్చిన వార్త సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయింది. అలాగే తెలంగాణ రాష్ట్ర ప్రజలు కూడా ఒక్కసారిగా షాక్ అయ్యారు. హైదరాబాద్ పోలీసు కమీషనర్ అంజనీ కుమార్ ఏకంగా 92 మంది పోలీసులను సస్పెండ్ చేశారంటూ కథనాన్ని ప్రచురించారు.
జీహెచ్ఎంసీ ఎన్నికల బరిలో నిలిచిన అభ్యర్థులకు ప్రత్యక్షంగా, పరోక్షంగా సహకరించిన 92 మంది పోలీసులకు నగర సిపి అంజనీ కుమార్ షాక్ ఇచ్చారని ఆ కథనంలో ఉంది. క్రమ శిక్షణ కలిగిన శాఖలో విధులు నిర్వర్తిస్తూ ఎన్నికల వేళ అత్యుత్సాహం చూపించడంతో సిపికి పలువురు ఫిర్యాదు చేయడంతో 72 మంది కానిస్టేబుళ్లు, 20 మంది హెడ్ కానిస్టేబుళ్లను సస్పెండ్ చేసినట్లుగా కథనంలో పేర్కొన్నారు. నాయకులతో కలిసి తిరిగిన పోలీసులకు సంబంధించిన ఫోటోలను కమీషనర్ పరిశీలించాకనే ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా కథనంలో రాసుకుని వచ్చారు. అందుకు సంబంధించిన పేపర్ క్లిప్పింగ్ సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది.
హైదరాబాద్ పోలీసు కమీషనర్ అంజనీ కుమార్ 92 మంది పోలీసులను సస్పెండ్ చేశారంటూ వైరల్ అవుతున్న పోస్టుల్లో 'ఎటువంటి నిజం లేదు'.
ఇందులో ఎటువంటి నిజం లేదని హైదరాబాద్ సీపీ అంజనీ కుమార్ తెలిపారు. పోలీసు అధికారులపై సస్పెన్షన్ అంటూ సామాజిక మాధ్యమాల్లో జరుగుతున్న ప్రచారాన్ని అంజనీ కుమార్ ఖండించారు. అది తప్పుడు ప్రచారమని కొట్టిపారేశారు. ఇలా తప్పుడు ప్రచారం చేసేవారిపై చట్టపరంగా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కావాలనే కొందరు తప్పుడు ప్రచారం చేస్తున్నారని, అటువంటి వారిపై చట్టపరంగా చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఇలాంటి వార్తలను నమ్మకండని ఆయన సూచించారు.
గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల కోసం పోలీసు యంత్రాంగం పని చేస్తోంది. 51500 మంది పోలీసులు ఎన్నికల విధుల్లో నిమగ్నమై ఉన్నారు. ఇక అంత మంది పోలీసులను సీపీ సస్పెండ్ చేసినట్లుగా ఏ మీడియా సంస్థలోనూ రాలేదు. ఇది తప్పుడు ప్రచారం అని హైదరాబాద్ సీపీ అంజనీ కుమార్ ధృవీకరించారు.
కాబట్టి వైరల్ అవుతున్న పోస్టుల్లో ఉన్నట్లుగా పోలీసు కమీషనర్ అంజనీ కుమార్ 92 మంది పోలీసులను సస్పెండ్ చేశారన్నది 'తప్పుడు వార్త'.
Claim Review:హైదరాబాద్ పోలీసు కమీషనర్ అంజనీ కుమార్ 92 మంది పోలీసులను సస్పెండ్ చేశారా..?