Fact Check : రష్యాకు చెందిన కోవిద్ వ్యాక్సిన్ హ్యూమన్ ట్రయల్స్ భారత్ లో మొదలయ్యాయా..?
Human trails of Sputnik Vaccine. భారత్ కు చెందిన కొందరు ఉద్యోగులు 'Russian Direct Investment Fund' 'Dr. Reddy's
By Medi Samrat Published on 13 Nov 2020 5:23 PM ISTభారత్ కు చెందిన కొందరు ఉద్యోగులు 'Russian Direct Investment Fund' 'Dr. Reddy's Sputnik V' అంటూ ఉన్న బాక్సులను తరలిస్తున్న వీడియోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతూ ఉన్నాయి. అవి రష్యాకు చెందిన స్పుత్నిక్ వ్యాక్సిన్ కు చెందినవంటూ సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెడుతూ ఉన్నారు.
భారత్ కు రష్యాకు చెందిన స్పుత్నిక్ వ్యాక్సిన్ ను పంపారు అంటూ వాట్సాప్ లో మెసేజీలు వైరల్ అవుతూ ఉన్నాయి. ఆ మెసేజీలతో పాటూ వీడియో కూడా వైరల్ అవుతూ ఉంది. భారత్ లో మనుషుల మీదకు ప్రయోగాలు చేయబోతున్నారని అందులో చెప్పుకొచ్చారు.
నిజ నిర్ధారణ:
భారత్ లో స్పుత్నిక్ వ్యాక్సిన్ ను తీసుకుని వచ్చి మనుషుల మీద ప్రయోగాలను చేయబోతున్నారనే పోస్టులు 'నిజం'.
రష్యా డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్(ఆర్.డి.ఐ.ఎఫ్.) భారత్ లోని డాక్టర్ రెడ్డీస్ ల్యాబోరేటరీస్ తో ఒప్పందం కుదుర్చుకుంది. కరోనా వ్యాక్సిన్ స్పుత్నిక్-వి మూడో దశ క్లినికల్ ట్రయల్స్,సప్లై కోసం రష్యా భారత ఫార్మా దిగ్గజం డా.రెడ్డీస్ ల్యాబోరేటరీస్‌తో ఒప్పందం కుదుర్చుకుంది. రష్యన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్(RDIF)తో కుదిరిన ఈ ఒప్పందం మేరకు డా.రెడ్డీస్ ల్యాబోరేటరీస్ 10కోట్ల డోసుల స్పుత్నిక్ వి వ్యాక్సిన్‌ను సప్లై చేయనుంది. వ్యాక్సిన్ ఉత్పత్తి,మూడో దశ క్లినికల్ ట్రయల్స్ కోసం రష్యాతో భాగస్వామ్యాన్ని భారత్ ధ్రువీకరించిన తర్వాత ఈ ఒప్పందం చోటు చేసుకుంది.
రష్యాలోని గమలేయా రీసెర్చ్ ఇనిస్టిట్యూట్ తయారుచేసిన స్పుత్నిక్-వి వ్యాక్సిన్‌కు మూడో దశ క్లినికల్ ట్రయల్స్ పూర్తి కాకుండానే అక్కడి ప్రభుత్వం అనుమతులిచ్చింది. భారత్‌లో మాత్రం పెద్ద సంఖ్యలో మూడో దశ క్లినికల్ ట్రయల్స్ పూర్తయి.. రెగ్యులేటరీ సంస్థలు దీని సేఫ్టీని ధ్రువీకరించాకే వ్యాక్సిన్ వాడకానికి అనుమతిస్తారు. డా.రెడ్డీస్ ల్యాబోరేటరీస్ కోఛైర్మన్,ఎండీ జీవీ ప్రసాద్ ఆర్‌డీఐఎఫ్‌తో ఒప్పందం కుదుర్చుకోవడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు. ఇప్పటికే స్పుత్నిక్ వి మొదటి,రెండో దశ ప్రయోగాలు సంతృప్తికర ఫలితాలనిచ్చాయని అన్నారు. త్వరలోనే భారత్‌లో మూడో దశ ప్రయోగాలు ప్రారంభిస్తామని మీడియాతో కొద్ది తెలిపారు.
ఆర్.డి.ఐ.ఎఫ్., డాక్టర్ రెడ్డీస్ తో ఒప్పందానికి సంబంధించిన సమాచారాన్ని Dr. Reddy's వెబ్సైట్ లో చూడొచ్చు. RDIF అధికారిక వెబ్ సైట్ లో కూడా మనం ఇదే విషయాన్ని గమనించవచ్చు.
India Today ఆర్.డి.ఐ.ఎఫ్. సిఈఓ కిరిల్ దిమిత్రీవ్ తో ఇంటర్వ్యూ నిర్వహించినప్పుడు తాము స్పుత్నిక్ వ్యాక్సిన్ ను నవంబర్-డిసెంబర్ మధ్యలో భారత్ కు డెలివరీ చేస్తామని చెప్పారు. NDTV తో కూడా ఆయన ఇదే విషయాన్ని చెప్పారు.
స్పుత్నిక్ వి వ్యాక్సిన్ భారత్ కు చేరుకుందంటూ ఇటీవల ఎటువంటి వార్తలు రాలేదు. కానీ కరోనా వ్యాక్సిన్ స్పుత్నిక్-వి మూడో దశ క్లినికల్ ట్రయల్స్,సప్లై కోసం రష్యా భారత ఫార్మా దిగ్గజం డా.రెడ్డీస్ ల్యాబోరేటరీస్‌తో ఒప్పందం కుదుర్చుకోవడం మాత్రం నిజమే.