Fact Check : భారత్ బయోటెక్ తయారుచేసిన కోవ్యాక్సిన్ ను ప్రపంచ ఆరోగ్య సంస్థ నిరాకరించిందా..?

Has WHO Disapproved Bharat Biotechs Covaxin. ప్రపంచ ఆరోగ్య సంస్థ కోవ్యాక్సిన్ ను నిరాకరించిందంటూ కొందరు నెటిజన్లు

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  1 Jun 2021 1:47 PM GMT
Fact Check : భారత్ బయోటెక్ తయారుచేసిన కోవ్యాక్సిన్ ను ప్రపంచ ఆరోగ్య సంస్థ నిరాకరించిందా..?

ప్రపంచ ఆరోగ్య సంస్థ కోవ్యాక్సిన్ ను నిరాకరించిందంటూ కొందరు నెటిజన్లు సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెడుతూ వస్తున్నారు.

ఆత్మనిర్భర్ భారత్ లో భాగంగా భారత్ తయారు చేసిన కోవ్యాక్సిన్ కు ప్రపంచ ఆరోగ్య సంస్థ షాక్ ఇచ్చిందని అందులో చెప్పుకొచ్చారు. కోవ్యాక్సిన్ టీకా వేయించుకుని ఇతర దేశాలకు వెళ్లలేమని.. ప్రపంచ ఆరోగ్య సంస్థ కోవ్యాక్సిన్ ను అత్యవసర వినియోగానికి అందించే టీకాల లిస్టు నుండి తీసి వేయించిందని ప్రచారం చేస్తున్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ అనుమతులు కోవ్యాక్సిన్ కు ఇవ్వలేదని చెబుతున్నారు. మోదీ ప్రభుత్వం మూడో దశ ప్రయోగాలను నిర్వహించకుండానే అత్యవసర అనుమతులను కోవ్యాక్సిన్ కు ఇచ్చిందని.. ఇప్పుడు ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆ వ్యాక్సిన్ ను పరిగణ లోకి తీసుకోవడం లేదని పోస్టులు పెడుతూ వస్తున్నారు.


అందుకు సంబంధించిన వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉంది. దీంతో కొందరిలో ఆందోళన మొదలైంది.

నిజ నిర్ధారణ:

వైరల్ అవుతున్న వార్త 'పాక్షికంగా నిజమే'. కోవ్యాక్సిన్ ను మూడో ఫేస్ ట్రయల్స్ లో ఉన్నప్పుడే ప్రజలకు అందించారన్నది నిజం. కోవ్యాక్సిన్ టీకాను ప్రపంచ ఆరోగ్య సంస్థ ఎమెర్జెన్సీ యూజ్ లిస్టింగ్ కోసం భారత్ బయోటెక్, కేంద్ర ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తున్నాయి. భారత్ బయోటెక్ తయారు చేసిన కోవ్యాక్సిన్ 81 శాతం ప్రభావశీలి కావడంతో త్వరలోనే ప్రపంచ ఆరోగ్య సంస్థ నుండి గుర్తింపు వచ్చే అవకాశాలు ఉన్నాయి.

ప్రపంచ ఆరోగ్య సంస్థ కోవ్యాక్సిన్ కు అనుమతి నిరాకరించిందా అనే వార్తల కోసం న్యూస్ మీటర్ సెర్చ్ చేయగా.. అలాంటిదేమీ లేదని స్పష్టంగా తెలుస్తోంది. భారత్ బయోటెక్ ప్రపంచ ఆరోగ్య సంస్థ గుర్తింపు కోసం దరఖాస్తు చేసుకోగా.. ఇంకాస్త సమాచారం ఇవ్వమని ప్రపంచ ఆరోగ్య సంస్థ భారత్ బయోటెక్ ను కోరింది. ఆ పనిలోనే భారత్ బయోటెక్ ఉంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ జులై-సెప్టెంబర్ 2021న అనుమతులు ఇచ్చే అవకాశాలు ఉన్నాయి.

కనీసం 50 శాతం ప్రభావశీలత (ఎఫికసీ) ఉంటే ఆ టీకాకు ప్రపంచ ఆరోగ్య సంస్థ గుర్తింపు లభిస్తుంది. కోవ్యాక్సిన్ కు అంతకంటే ఎక్కువగానే ప్రభావశీలత ఉన్నట్లు మూడో దశ క్లినికల్‌ పరీక్షల్లో తెలిసింది.

అమెరికా, ఐరోపా దేశాలు వివిధ పనుల మీద తమ దేశాలకు వచ్చే వారిని ఇప్పుడిప్పుడే అనుమతిస్తున్నాయి. అలా వచ్చే వారు గుర్తింపు పొందిన కొవిడ్‌-19 టీకా తీసుకుని ఉండాలని నిర్దేశిస్తున్నాయి. అందుకే గుర్తింపు పొందే ప్రక్రియను భారత్‌ బయోటెక్‌ వేగవంతం చేసింది. కోవ్యాక్సిన్ టీకాకు డబ్ల్యూహెచ్‌ఓ గుర్తింపు సంపాదించేందుకు కేంద్రం కూడా రంగంలోకి దిగింది. ఆరోగ్య మంత్రిత్వ శాఖ, విదేశీ మంత్రిత్వ శాఖ ఉన్నతాధికార వర్గాలు దీనికి కార్యాచరణపై దృష్టి సారించాయి.

భారత్ తో పాటు 11 దేశాల్లో 'కొవాగ్జిన్‌'కు అత్యవసర అనుమతి లభించిందని భారత్‌ బయోటెక్‌ తెలిపింది. ఆయా దేశాలు టీకా కొనుగోలుకు ఆసక్తిగా ఉన్నట్లు వివరిస్తున్నాయి. ఫిలిప్పీన్స్‌, మెక్సికో, ఇరాన్‌, పరాగ్వే, గ్వాటిమాలా, నికరాగ్వా, గయానా, వెనెజువెలా, జింబాబ్వే.. తదితర దేశాల్లో దీనికి అత్యవసర అనుమతి లభించింది. అమెరికా, ఐరోపా సహా మరో 60 దేశాల్లో గుర్తింపు కోసం భారత్‌ బయోటెక్‌ ప్రయత్నాలు చేస్తోంది. అమెరికాలో చిన్న స్థాయిలో మూడో దశ క్లినికల్‌ పరీక్షలు నిర్వహించి అక్కడ దీనికి అనుమతి సంపాదించేందుకు ఇప్పటికే అమెరికా ఔషధ నియంత్రణ సంస్థ (యూఎస్‌ఎఫ్‌డీఏ)తో సంప్రదింపులు చేపట్టింది.

భారత్ బయోటెక్ తయారుచేసిన కోవ్యాక్సిన్ ను ప్రపంచ ఆరోగ్య సంస్థ నిరాకరించిందంటూ వైరల్ అవుతున్న వార్తల్లో ఎటువంటి నిజం లేదు. ప్రపంచ ఆరోగ్య సంస్థ అనుమతుల కోసం భారత్ బయోటెక్ ప్రయత్నాలు చేస్తూ ఉంది. త్వరలోనే అనుమతులు వచ్చే అవకాశం ఉంది.


Next Story