భారతదేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు రోజు రోజుకీ పెరిగిపోతూ ఉన్న సంగతి తెలిసిందే..! పలు రాష్ట్రాల్లో పెట్రోల్ లీటర్ ధర 100 రూపాయలు దాటేసింది. తమిళనాడు రాష్ట్రంలో పెట్రోల్-డీజిల్ ధరలు భారీగానే పెరిగాయి.
అయితే డిఎంకె నేత, తమిళనాడు ముఖ్యమంత్రి ఎం.కె.స్టాలిన్ ఫోటోతో పాటు ఇండియా టుడే కథనం యొక్క స్క్రీన్ షాట్‌ను పలువురు ఫేస్‌బుక్ వినియోగదారులు పంచుకుంటున్నారు. పెట్రోల్, డీజిల్ ధరలను పెంచాలని డిఎంకె నిర్ణయించినట్లు ఆ పోస్టుల్లో ఉంది. "తమిళనాడు ప్రభుత్వం పెట్రోల్ ధర లీటరుకు 3.25 రూపాయలు, డీజిల్ 2.50 రూపాయలు వ్యాట్ పెంచుతోంది" అని వ్యాసం శీర్షికలో ఉంది.
స్క్రీన్‌షాట్‌తో పాటూ "డిఎంకె ప్రభుత్వం పెట్రోల్ మరియు డీజిల్‌పై వ్యాట్‌ను పెంచింది" అని అర్థం వచ్చేలా పలువురు సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు.
నిజ నిర్ధారణ:
ఇంధన ధరలను పెంచాలని డిఎంకె నిర్ణయించిందన్న కథనాల్లో ఎటువంటి నిజం లేదు.
వైరల్ అవుతున్న పోస్టుల్లో ఉన్న స్క్రీన్ షాట్ లోని కథనం ఇండియా టుడే నుండి 3 మే 2020 న వెలువడింది. ఆ సమయంలో తమిళనాడులో ఎఐఎడిఎంకె ప్రభుత్వం అధికారంలో ఉంది. అప్పట్లో ఇంధనంపై వ్యాట్ ను సవరించాలని నిర్ణయించింది అక్కడి ప్రభుత్వం. దీనివల్ల పెట్రోల్ ధరలు రూ. 3.25, డీజిల్‌కు రూ. లీటరుకు 2.50 రూపాయలు పెంచారు. ఒక సంవత్సరం తరువాత మే 2021 లో డిఎంకె అధికారంలోకి వచ్చింది. ఇండియా టుడే కథనం ఇటీవలిది కాదని.. డిఎంకెతో సంబంధం లేదని ఇది రుజువు చేస్తుంది.
మార్చి 2021 నుండి వచ్చిన నివేదికల ప్రకారం.. స్టాలిన్ నేతృత్వంలోని డిఎంకె 2021 తమిళనాడు ఎన్నికలకు తన పోల్ మ్యానిఫెస్టోను విడుదల చేసింది. తమ పార్టీకి ఓటు వేస్తే పెట్రోల్ మరియు డీజిల్ ధరలను రూ. 5 , రూ. 4. తగ్గించడమే కాకుండా ఎల్‌పిజి సిలిండర్‌పై 100 రూపాయలు తగ్గిస్తామని తెలిపింది.
డిఎంకె అధికారం లోకి వచ్చాక.. పెట్రోల్-డీజిల్ ధరలను తగ్గిస్తూ ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు. ఇక ప్రతి పక్ష అన్నాడిఎంకె నేతలు ప్రభుత్వం తన మాట నిలబెట్టుకోవాలని విమర్శలు గుప్పిస్తూ ఉన్నారు. పెట్రోల్-డీజిల్ లను జీఎస్టీ కిందకు తీసుకుని రావాలనే డిమాండ్ కూడా మొదలైంది.
ఇప్పటి వరకూ వ్యాట్ ను పెంచుతున్నట్లుగా డిఎంకె అయితే ఎటువంటి ప్రకటన ఇవ్వలేదు. అలాంటి కథనాలు కూడా రాలేదు.
పెట్రోల్-డీజిల్ పై వ్యాట్ ను పెంచుతున్నట్లుగా డిఎంకె నిర్ణయం తీసుకుందన్న పోస్టుల్లో ఎటువంటి నిజం లేదు. వైరల్ అవుతున్న పోస్టులు 'పచ్చి అబద్ధం'.