జులై 18న తమిళనాడులోని సేలం జిల్లా కళ్లకురిచ్చిలోని శక్తి మెట్రిక్యులేషన్ స్కూల్ ఆవరణలో 12వ తరగతి విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడింది.
దీంతో ఫేస్‌బుక్‌లో ఓ యువతి వీడియో వైరల్‌గా మారింది. సోషల్ మీడియా యూజర్లు ఆమెను ఆత్మహత్య చేసుకున్న విద్యార్థినిగా ప్రచారం చేస్తున్నారు. ఆ అమ్మాయి ఆత్మకు శాంతి కలగాలని చెబుతూ.. నెటిజన్లు వీడియోను షేర్ చేస్తున్నారు.
నిజ నిర్ధారణ :
NewsMeter బృందం.. ఇన్‌విడ్ సెర్చ్ చేసింది. అదే వీడియో డిసెంబర్ 2018లో Kaumara Madalayam అనే యూట్యూబ్ పేజీ ద్వారా అప్‌లోడ్ చేయబడిందని కనుగొన్నాం. రోటరీ కోయంబత్తూరు గెలాక్సీ ఆధ్వర్యంలో గ్రామీణ విద్యార్థుల కోసం జరిగిన సాంస్కృతిక, క్రీడా ఉత్సవంలో ప్రసంగించిన కె. భవధరాణి అనే 8వ తరగతి విద్యార్థిని ఆ వీడియోలో ఉంది.
వైరల్ వీడియోను.. కళ్లకురిచ్చిలో జరిగిన ఆత్మహత్యకు తప్పుగా లింక్ చేశారని పోలిమర్ న్యూస్ నివేదించింది. భవధరణి మీడియాతో మాట్లాడుతూ.. "చాలా సంవత్సరాల క్రితం నేను పాఠశాలలో కామరాజ్ చరిత్రపై ప్రసంగించినప్పుడు తీసిన నా వీడియో ఆన్‌లైన్‌లో షేర్ చేయబడుతోంది, నా బంధువులు చాలా మంది వీడియో చూసి నేను చనిపోయానని భావించారు, వారు మమ్మల్ని కాంటాక్ట్ అయ్యారు. నా కుటుంబ సభ్యులను కూడా కలిశారు. వీడియోలో ఉన్న అమ్మాయి కళ్లకురిచ్చిలో చనిపోయిన అమ్మాయి అని నా వీడియోలు చాలా పోస్ట్ చేస్తున్నారు, కానీ అది నిజం కాదు. మేము ఇద్దరం వేర్వేరు వ్యక్తులం. ఇకనైనా ఆ వీడియో షేర్ చేయడం ఆపమని నేను ప్రజలను అభ్యర్థిస్తున్నాను" అని చెప్పుకొచ్చింది.
ఈ తప్పుడు సమాచారం గురించి.. విద్యార్థి పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు మీడియా సంస్థ తెలిపింది.
కాబట్టి, వైరల్ అవుతున్న పోస్టుల్లో 'ఎటువంటి నిజం లేదు'.