నిజమెంత: 2024 లోక్ సభ ఎన్నికల ప్రచారం చేస్తున్నప్పుడు అరవింద్ కేజ్రీవాల్ మీద దాడి చేశారా?
ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్‌ను ఓ వ్యక్తి చెంపదెబ్బ కొట్టిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉంది.
By న్యూస్‌మీటర్ తెలుగు Published on 18 May 2024 1:00 PM ISTనిజమెంత: 2024 లోక్ సభ ఎన్నికల ప్రచారం చేస్తున్నప్పుడు అరవింద్ కేజ్రీవాల్ మీద దాడి చేశారా?
ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఇటీవలే జైలు నుండి విడుదలయ్యారు. వచ్చీ రాగానే భారతీయ జనతా పార్టీ మీద విమర్శలు గుప్పిస్తూ.. ఎన్నికల ప్రచారం చేస్తూ ఉన్నారు.
రోడ్‌షో సందర్భంగా ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) అధినేత అరవింద్ కేజ్రీవాల్‌ను ఓ వ్యక్తి చెంపదెబ్బ కొట్టిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉంది. ఢిల్లీ లిక్కర్ పాలసీ స్కామ్ కేసులో కేజ్రీవాల్ బెయిల్‌పై జైలు నుంచి విడుదలైన తర్వాత 2024 ఎన్నికల సమయంలో పార్టీ ప్రచారం సందర్భంగా ఈ సంఘటన జరిగిందని వీడియోను షేర్ చేస్తున్న వారు చెబుతున్నారు.
ఈ వీడియో ప్రస్తుతం జరుగుతున్న ఎన్నికల ప్రచారానికి సంబంధించినదంటూ ఒక X వినియోగదారు మే 12, 2024న వీడియోని పోస్టు చేశారు. ప్రస్తుతం జరుగుతున్న ఎన్నికలకు లింక్ చేస్తూ షేర్ చేసారు. (ఆర్కైవ్)
పలు సోషల్ మీడియా ఖాతాలలో ఇదే వాదనతో వీడియోను షేర్ చేశారు.
నిజ నిర్ధారణ:
వైరల్ వీడియో లోని విజువల్స్ ఈ మధ్య చోటు చేసుకున్న ఘటనకు సంబంధించినది కాదని న్యూస్ మీటర్ ధృవీకరించింది.
ఈ వీడియో మే 4, 2019 నాటిదని.. 2024 సార్వత్రిక ఎన్నికలకు సంబంధించినది కాదని NewsMeter బృందం తెలుసుకుంది.
మేము వీడియో కీఫ్రేమ్‌లను తీసుకుని రివర్స్ ఇమేజ్ సెర్చ్ ను అమలు చేశాం. మే 4, 2019న హిందూస్తాన్ టైమ్స్ యూట్యూబ్ ఛానెల్‌లో అప్లోడ్ చేశారు. ‘Watch: Delhi CM Arvind Kejriwal slapped during roadshow in Moti Nagar.’ అనే టైటిల్ తో వీడియోను అప్లోడ్ చేశారు. ఢిల్లీ సిఎం అరవింద్ కేజ్రీవాల్ ను మోతీ నగర్‌లో రోడ్‌షో సందర్భంగా చెంపదెబ్బ కొట్టారని టైటిల్ ద్వారా మేము గుర్తించాం.
2019 లోక్‌సభ ఎన్నికల ప్రచారం సందర్భంగా ఢిల్లీలోని మోతీ నగర్ ప్రాంతంలో ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ రోడ్‌షో సందర్భంగా ఈ సంఘటన చోటు చేసుకుంది.
ఈ ఘటనకు సంబంధించి కీవర్డ్ సెర్చ్ చేయగా.. మే 5, 2019 న NDTV లో ‘ఢిల్లీలో రోడ్‌షోలో అరవింద్ కేజ్రీవాల్ ను చెంపదెబ్బ కొట్టారు, ఈ ఘటనకు బీజేపీనే కారణమని AAP ఆరోపించింది.’ అనే శీర్షికతో ఒక నివేదిక ను కూడా మేము కనుగొన్నాం.
‘ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌ను శనివారం మోతీ నగర్ ప్రాంతంలో రోడ్‌షోలో ఓ వ్యక్తి చెంపదెబ్బ కొట్టాడు. కేజ్రీవాల్, ఆమ్ ఆద్మీ పార్టీ చీఫ్, ఓపెన్ జీపుపై నిలబడి, న్యూఢిల్లీ నియోజకవర్గంలో ప్రచారం చేస్తుండగా ఆ వ్యక్తి కేజ్రీవాల్ పై దాడి చేశాడు. అతడిని 33 సంవత్సరాల సురేష్ గా గుర్తించారు. అతడిని విడిభాగాల డీలర్‌గా గుర్తించారు. మరోవైపు ఈ దాడికి బీజేపీయే కారణమని ఆప్ ఆరోపించింది.' అంటూ కథనాన్ని ప్రచురించారు.
డెక్కన్ క్రానికల్ మే 10, 2019న దాడి చేసిన సురేష్ తన చర్యలకు పశ్చాత్తాపాన్ని వ్యక్తం చేశాడంటూ కథనాన్ని ప్రచురించారు. ముఖ్యమంత్రిపై ఎందుకు దాడి చేశాడో అర్థం కావడం లేదని ఆ ప్రకటనలో తెలిపారు.
ది ఇండియన్ ఎక్స్‌ప్రెస్, బిజినెస్ స్టాండర్డ్, ఫస్ట్‌పోస్ట్, టైమ్స్ ఆఫ్ ఇండియా మీడియా సంస్థల నుండి కూడా మేము ఇలాంటి నివేదికలను కనుగొన్నాము.
వైరల్ అవుతున్న పోస్టులకు సంబంధించిన వీడియో 5 సంవత్సరాల పాతది. 2024 లోక్‌సభ ఎన్నికలలో కేజ్రీవాల్ ఎన్నికల ప్రచారానికి ఎటువంటి సంబంధం లేదు. వైరల్ అవుతున్న వాదన ప్రజలను తప్పుదారి పట్టించేదిగా ఉంది.
Credits: Sibahathulla Sakib