Fact Check : యాగ్జిస్ ఇండియా ఎగ్జిట్ పోల్స్ లో కాంగ్రెస్ పార్టీ లీడింగ్ లో ఉందా..?

Exit poll by Axis India showing Congress leading in GHMC polls. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ఫలితాల కంటే ముందు వచ్చే ఎగ్జిట్

By Medi Samrat  Published on  2 Dec 2020 2:36 PM GMT
Fact Check : యాగ్జిస్ ఇండియా ఎగ్జిట్ పోల్స్ లో కాంగ్రెస్ పార్టీ లీడింగ్ లో ఉందా..?

జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ఫలితాల కంటే ముందు వచ్చే ఎగ్జిట్ పోల్స్ మీద ఎంతో ఆసక్తి ఉంటుంది. డిసెంబర్ 1న పోలింగ్ పూర్తీ అయ్యింది. సాయంత్రానికల్లా ఎగ్జిట్ పోల్స్ సందడి మొదలుకావాల్సి ఉండగా.. ఓల్డ్ మలక్ పేటలో రీపోలింగ్ కారణంగా ఎగ్జిట్ పోల్స్ ను విడుదల చేయకూడదని ఈసీ ఆదేశాలు జారీ చేయడం జరిగింది.



ఇంతలో యాగ్జిస్ ఇండియా ఒపీనియన్ పోల్స్ కు సంబంధించిన ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు అంటూ సామాజిక మాధ్యమాల్లో పోస్టులు వైరల్ అవుతూ ఉన్నాయి. కాంగ్రెస్ పార్టీకి 73 సీట్లు, టీఆర్ఎస్ కు 37, బీజేపీ 24, ఎంఐఎంకు 14 స్థానాలు వచ్చే అవకాశం ఉందని వైరల్ అవుతున్న ఫోటోలో ఉంది. పలువురు ఈ పోస్టులను వైరల్ చేస్తూ ఉన్నారు.

నిజ నిర్ధారణ:

యాగ్జిస్ ఇండియా ఒపీనియన్ పోల్ కు సంబంధించిన పోస్టుల్లో ఎటువంటి నిజం లేదు.

ముంబైకు చెందిన యాగ్జిస్ ఇండియా అధికారిక సోషల్ మీడియా ఖాతాలను పరిశీలించగా ఆ సంస్థ హైదరాబాద్ జీహెచ్ఎంసీ ఎన్నికలకు సంబంధించిన ఎటువంటి సర్వేలను చేపట్టలేదని తేలింది.

యాగ్జిస్ ఇండియా సంస్థ బీహార్, మధ్య ప్రదేశ్ ఎన్నికలకు సంబంధించిన ఎగ్జిట్ పోల్స్ ను నిర్వహించినా.. జీహెచ్ఎంసీ ఎన్నికలకు సంబంధించి ఎటువంటి సర్వే ను చేయలేదు.

https://www.axismyindia.org/press-releases.php

ఓల్డ్ మలక్ పేట డివిజన్ లోని 69 పోలింగ్ కేంద్రాల్లో పోలింగ్ నిలిచిపోయింది. కంకి కొడవలి గుర్తుకు బదులుగా సుత్తి కొడవలి గుర్తు బ్యాలెట్ పేపర్ పై ముద్రించారు. సీపీఐ తరఫున ఈ డివిజన్ నుంచి పోటీ పడుతున్న ఫాతిమా, తన పేరు పక్కన సీపీఎం గుర్తు తప్పుగా ఉందని భావించి.. విషయాన్ని రిటర్నింగ్ అధికారులకు, ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. ఎన్నికలు జరపాల్సిందేనని ఎంఐఎం, టీఆర్ఎస్ పార్టీల నేతలు డిమాండ్ చేశారు. కానీ ఎన్నికల సంఘం మాత్రం జరిగిన తప్పుపై స్పందిస్తూ, డివిజన్ మొత్తం పోలింగ్ ను నిలిపివేస్తున్నట్టు ప్రకటించారు. ఈసీ నుంచి ఆదేశాలు రాగానే, పోలింగ్ కేంద్రాల్లో ఉన్న సిబ్బంది తమ సరంజామాను తీసుకుని వెళ్లిపోయారు. గుర్తులు మారిపోయిన విషయం దాదాపు 5 శాతం పోలింగ్ జరిగిన తరువాత వెలుగులోకి వచ్చింది. 3వ తేదీన ఇక్క‌డ రీపోలింగ్‌ను నిర్వ‌హించ‌నున్న‌ట్లు అధికారులు తెలిపారు. ఆ తర్వాతనే ఎగ్జిట్ పోల్స్ కు సంబంధించిన సమాచారాన్ని తెలియజేయాలని ఎన్నికల సంఘం తెలిపింది. అంతలోనే ఈ పోస్టు వైరల్ అవ్వడంతో ఇది ఫేక్ పోస్టు అని స్పష్టంగా తెలుస్తోంది.

అందుకు సంబంధించిన కథనాలు పలు మీడియా సంస్థల్లో వచ్చాయి.

https://timesofindia.indiatimes.com/city/hyderabad/live-updates-hyderabad-ghmc-elections-2020-voting-underway/liveblog/79501872.cms

యాగ్జిస్ ఇండియా ఒపీనియన్ పోల్ కు సంబంధించిన పోస్టుల్లో ఎటువంటి నిజం లేదని తెలుస్తోంది. వైరల్ అవుతున్న పోస్టు 'తప్పుడు వార్త'.


Next Story