ఎలెక్ట్రానిక్ ఓటింగ్ మెషీన్లు(ఈవీఎం) లను ఓ వ్యక్తి ఎత్తుకుని వెళుతున్న ఫోటోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతూ ఉన్నాయి. బీహార్ ఎన్నికల సమయంలో ఈ ఘటన చోటు చేసుకుందని చెబుతూ ఉన్నారు. రాష్ట్రీయ జనతా దళ్ ఓటమికి ఇలాంటి ఘటనలే కారణమని పలువురు పోస్టులు పెడుతూ ఉన్నారు. 'ఈవీఎంలను మరోసారి పరిశీలించాలి. నితీష్ కుమార్ జైలు కు వెళ్లాల్సి ఉంటుంది.' అంటూ పోస్టులు వెలిశాయి.

"EVM machines should be checked again, will Nitish Kumar go to jail? Bihar is asking, where is he taking the EVM machine after stealing them? Modi commission is a thief." అంటూ పోస్టులను పెట్టడం గమనించవచ్చు.నిజ నిర్ధారణ:

బీహార్ ఎన్నికల్లో ఈవీఎం లను ఎత్తుకెళ్లిపోతున్నారు అంటూ వైరల్ అవుతున్న పోస్టుల్లో 'ఎటువంటి నిజం లేదు'.

ఈ ఫోటో ను రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేయగా.. అక్టోబర్ 2019 సమయానికి చెందినది. మహారాష్ట్ర లోని రాయఘడ్ కు చెందినవి. గత ఏడాది మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు జరిగిన సమయంలో తీసినవి.రాయఘడ్ డిఈఓ ఈ ఫోటోను ట్విట్టర్ లో పోస్టు చేశారు. 'మారుమూల ప్రాంతాల్లోని పోలింగ్ స్టేషన్స్ కు ఉద్యోగులు చేరుకుంటూ ఉన్నారని.. ఉద్యోగుల పట్ల చాలా గర్వంగా ఉంది' అని పోస్టు చేశారు. మారుమూల ప్రాంతమైన కల్ కరాయ్ అనే ప్రాంతానికి ఎలెక్షన్ డ్యూటీకి వెళుతుండగా తీసిన ఫోటో ఇది.రాయఘడ్ జిల్లా డిస్ట్రిక్ట్ ఇన్ఫర్మేషన్ ఆఫీసు నుండి కూడా ఇదే ట్వీట్ వచ్చింది. మారుమూల ప్రాంతమైన కల్ కరాయ్ అనే ప్రాంతానికి ఎలెక్షన్ డ్యూటీకి వెళుతున్నారని.. ఉద్యోగుల నిబద్ధతకు ధన్యవాదాలు తెలిపారు.

ఎన్నికల అధికారులు ఈవీఎంలను మహారాష్ట్ర లోని మారు మూల ప్రాంతాలకు 2019 సంవత్సరంలో జరిగిన ఎన్నికల్లో భాగంగా తీసుకుని వెళ్తున్న ఫోటో ఇది. బీహార్ ఎన్నికల్లో ఈవీఎం లను దొంగిలించారు అంటూ జరుగుతున్న ప్రచారానికి, ఈ ఫోటోలకు ఎటువంటి సంబంధం లేదు. వైరల్ అవుతున్న పోస్టుల్లో 'ఎటువంటి నిజం లేదు'.


సామ్రాట్

Next Story