అపరిశుభ్రమైన పరిస్థితుల్లో గిన్నెలు కడుగుతున్న వీడియోను సోషల్ మీడియా యూజర్లు షేర్ చేస్తున్నారు. కేరళలోని కొట్టాయంలోని ఓ హోటల్ కు చెందిన సిబ్బంది గుంతలో పాత్రలు కడుగుతున్నారని వినియోగదారులు పేర్కొంటున్నారు.
వీడియోతో పాటు షేర్ చేసిన టెక్స్ట్ ఇలా ఉంది: "కొట్టాయంలో ఒక వెజ్ హోటల్. వీలైనంత వరకు హోటల్ ఫుడ్ మానుకోండి." అంటూ చెప్పుకొచ్చారు.
నిజ నిర్ధారణ :
కొట్టాయంలో జరిగిన అటువంటి సంఘటనపై ఏ మీడియా సంస్థ కూడా నివేదించినట్లు న్యూస్‌మీటర్ కనుగొనలేదు. నిజంగా ఒక రెస్టారెంట్ అలా పట్టుబడితే, అన్ని ప్రధాన వార్తా సంస్థలు దానిని కవర్ చేస్తాయి. దీంతో ఈ ఘటన కొట్టాయంలో జరగలేదని తెలుస్తోంది.
రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేయగా.. 2018లో కౌలాలంపూర్‌లో ఈ సంఘటన జరిగిందని పేర్కొంటూ పలు మీడియా సంస్థల వార్తా నివేదికలకు దారితీసింది. బంగ్సర్‌లోని 'బనానా రైస్' రెస్టారెంట్ కార్మికులు మురికి నీటి గుంటలో గిన్నెలు కడుగుతూ పట్టుబడ్డారు.
డైలీ మెయిల్, NST, ది స్టార్, స్ట్రెయిట్ టైమ్స్, టుడే ఆన్‌లైన్‌తో సహా పలు మీడియా సంస్థలు రెస్టారెంట్ అపరిశుభ్రమైన పద్ధతులకు పాల్పడుతున్నట్లు కెమెరాకు చిక్కినట్లు నివేదించాయి. ఈ సంఘటనకు కొత్త సిబ్బంది కారణమంటూ రెస్టారెంట్ క్షమాపణలు చెప్పింది, ఆ తర్వాత హోటల్ మూసివేయబడింది. "పరిశుభ్రత మా మొదటి ప్రాధాన్యత" అని రెస్టారెంట్ ఫేస్‌బుక్ పోస్ట్‌లో క్షమాపణలు కోరింది.
కడగడానికి సరైన సౌకర్యాలు లేవని గుర్తించిన ఆరోగ్య అధికారులు రెస్టారెంట్‌ను మూసివేశారు.
కాబట్టి.. కౌలాలంపూర్‌లో చోటు చేసుకున్న ఘటనకు సంబంధించిన పాత వీడియో కేరళలోని కొట్టాయంలో ఇటీవల జరిగిన సంఘటనగా తప్పుగా షేర్ చేయబడుతోంది.