Fact Check : దిశా రవి సిరియాకు చెందిన క్రిస్టియన్ అంటూ జరుగుతున్న ప్రచారం..?

Disha Ravi is a Hindu, not Syrian Christian from Kerala. బెంగళూరుకు చెందిన దిశా రవి అరెస్ట్ అయ్యిన వెంటనే సామాజిక మాధ్యమాల్లో

By Medi Samrat  Published on  20 Feb 2021 5:19 AM GMT
Fact Check : దిశా రవి సిరియాకు చెందిన క్రిస్టియన్ అంటూ జరుగుతున్న ప్రచారం..?

బెంగళూరుకు చెందిన దిశా రవి అరెస్ట్ అయ్యిన వెంటనే సామాజిక మాధ్యమాల్లో ఆమె మీద ఎన్నో రూమర్లు వైరల్ అవుతూ ఉన్నాయి. 22 సంవత్సరాల పర్యావరణ కార్యకర్తను ఢిల్లీ పోలీసులు అరెస్టు చేశారు. ఆమె అరెస్ట్ అయిన తర్వాత ఆమె గురించి పెద్ద ఎత్తున రూమర్లు వైరల్ అవ్వడం మొదలయ్యాయి.




అలాంటి ఓ రూమర్ ఏమిటంటే దిశా రవి పూర్తీ పేరు 'దిశా రవి జోసెఫ్' అని ఆమె కేరళకు చెందిన సిరియన్ క్రిస్టియన్ అంటూ ప్రచారం చేస్తున్నారు.



ఆమె పూర్తీ పేరు దిశా రవి జోసెఫ్ ఇప్పుడైనా మీకు అర్థమవుతోందా అంటూ పలు పేజీలలో అందుకు సంబంధించిన పోస్టులు వెలిశాయి.



అందుకు సంబంధించిన ట్వీట్లు చాలా వరకూ వైరల్ అయ్యాయి. ఆమె కేరళకు చెందిన మహిళ అంటూ పలువురు చెప్పుకొచ్చారు.



నిజ నిర్ధారణ:

దిశా రవి సిరియన్ క్రిస్టియన్ అంటూ వైరల్ అవుతున్న పోస్టుల్లో ఎటువంటి నిజం లేదు. ఆమె కేరళకు చెందిన యువతి అంటూ వైరల్ అవుతున్న పోస్టులు కూడా పచ్చి అబద్ధం.

దిశా రవి బెంగళూరుకు చెందిన యువతి. ఆమె కుటుంబం కర్ణాటక రాష్ట్రం మైసూరుకు చెందినది. అయితే గత 13 సంవత్సరాలుగా దిశా రవి బెంగళూరులోనే నివసిస్తూ ఉంది.

న్యూ ఇండియన్ ఎక్స్ ప్రెస్ కథనం ప్రకారం దిశా తల్లి మంజులా మాట్లాడుతూ.. తాము చాలా మధ్య తరగతి కుటుంబం నుండి వచ్చామని.. వ్యవసాయం అంటే తమకు ఇష్టమని తెలిపారు. వ్యవసాయంలో ఎన్నో ఎత్తు పల్లాలు చూసిన కుటుంబం తమదని అన్నారు. అందుకే దిశా కూడా పర్యావరణం పట్ల ఎంతో ఇష్టాన్ని పెంచుకుందని చెప్పుకొచ్చారు. తమ కుటుంబం ఓల్డ్ మైసూర్ నుండి వచ్చి బెంగళూరు లోని చిక్కబన్నవర ప్రాంతంలో గత 13 సంవత్సరాలుగా నివసిస్తూ ఉందని తెలిపారు.

దిశా రవి తండ్రి మైసూరులో అథ్లెటిక్స్ కోచ్ గా ఉన్నారు. అందుకే దిశా తన తల్లితో కలిసి బెంగళూరులో ఉంటోంది. ఇండియన్ ఎక్స్ప్రెస్ కథనం ప్రకారం దిశా తన తల్లితో కలిసి బెంగళూరులో ఉంటోందని స్థానికులు తెలిపారని చెప్పారు. దిశా పర్యావరణ వేత్త మాత్రమే కాకుండా ఫ్రైడేస్ ఫర్ ఫ్యూచర్ అనే సంస్థకు ఫౌండర్ లో ఒకరు. శుక్రవారం పూట ఈ సంస్థతో కలిసి పర్యావరణం కోసం చేయాల్సిన.. చేపట్టాల్సిన చర్యల గురించి చర్చించడమే కాకుండా.. నాయకులు తీసుకోవాల్సిన చర్యల గురించి కూడా రోడ్డు మీదకు వచ్చి నిరసనలు తెలియజేస్తూ ఉంటారు. బెంగళూరు లోని మౌంట్ కేరమెల్ కాలేజీలో గ్రాడ్యుయేషన్ ను పూర్తీ చేసింది దిశా. బ్రిటీష్ వోగ్ మ్యాగజైన్ లో కూడా ఆమె గురించిన ప్రస్తావన వచ్చింది. పలు వార్తా సంస్థల్లో ఆమె పర్యావరణ మార్పులకు సంబంధించిన ఆర్టికల్స్ ను కూడా రాస్తూ వస్తుంటారు.

The Print కథనం ప్రకారం దిశా రవి తన తల్లితో పాటూ నివసిస్తూ ఉండేది. వారి కుటుంబంలో దిశా మాత్రమే సంపాదిస్తూ ఉంది. మొదట మీడియా దిశా తల్లి మంజులను కలిసినప్పుడు ఆమె మాట్లాడడానికి నిరాకరించారు. ఇక కొందరు చుట్టుపక్కల వ్యక్తులు మాత్రం దిశా చాలా తక్కువగా మాట్లాడుతూ ఉండేదని.. తన జర్మన్ షెప్పర్డ్ కుక్కతో వాక్ కు కూడా వచ్చేదని తెలిపారు.

దిశా రవి జోసెఫ్ అంటూ వైరల్ అవుతున్న పోస్టుల్లో ఎంత మాత్రం నిజం లేదని దిశా స్నేహితులు తెలిపారు. దిశా రవి పూర్తీ పేరు 'దిశా అన్నప్ప రవి'. లాయర్ ప్రసన్న ఆర్ మాట్లాడుతూ దిశా తల్లి పేరు మంజుల నంజయ్య.. తండ్రి పేరు రవి. వారు కర్ణాటక రాష్ట్రం తుముకూరు జిల్లా తిప్తూర్ కు చెందిన వారు. ప్రసన్న మాట్లాడుతూ దిశా మతం గురించి ఇక్కడ చర్చ అవసరం లేదని.. ఆమెకు పర్యావరణం అంటే ఇష్టం అని.. ఆమెకు అన్ని మతాలలోనూ స్నేహితులు ఉన్నారని తెలిపారు. దిశా రవి లింగాయత్ కుటుంబంలో పుట్టి పెరిగిందని క్లారిటీ ఇచ్చారు. ఇలాంటి రూమర్లను ఖండిస్తూ రావాల్సి రావడం తమ దురదృష్టం అని చెప్పుకొచ్చారు.

దిశా రవి కేరళకు చెందిన యువతి అంటూ వైరల్ అవుతున్న పోస్టుల్లో 'ఎటువంటి నిజం లేదు' ఆమె కర్ణాటక రాష్ట్రానికి చెందిన యువతి. దిశా రవి సిరియన్ క్రిస్టియన్ అంటూ వైరల్ అవుతున్న పోస్టులు కూడా 'పచ్చి అబద్ధం'.


Claim Review:దిశా రవి సిరియాకు చెందిన క్రిస్టియన్ అంటూ జరుగుతున్న ప్రచారం..?
Claimed By:Social Media Users
Claim Reviewed By:Newsmeter Telugu
Claim Source:Facebook, Twitter
Claim Fact Check:False
Next Story