FactCheck : ఉక్రెయిన్ తో యుద్ధం వద్దని చెబుతున్నందుకు రష్యా భారత్ కు వార్నింగ్ ఇచ్చిందా..?

Did Putin Warn India Against Interfering in the Ukraine Conflict Heres the Truth. ఉక్రెయిన్‌లో యుద్ధ వాతావరణంలో ప్ర‌జ‌లు భయంభయంగా గడుపుతున్నారు.

By న్యూస్‌మీటర్ తెలుగు
Published on : 28 Feb 2022 6:18 PM IST

FactCheck : ఉక్రెయిన్ తో యుద్ధం వద్దని చెబుతున్నందుకు రష్యా భారత్ కు వార్నింగ్ ఇచ్చిందా..?

ఉక్రెయిన్‌లో యుద్ధ వాతావరణంలో ప్ర‌జ‌లు భయంభయంగా గడుపుతున్నారు. కొంద‌రు ప్ర‌జ‌లు సుర‌క్షిత ప్రాంతాల‌కు వెళ్లి త‌ల‌దాచుకుంటుండ‌గా ఇంకొందరు ఆయుధాలు చేత‌బ‌ట్టి ర‌ష్యా సైన్యానికి ఎదురు నిలుస్తున్నారు. విదేశాల నుంచి కూడా ఉక్రెయిన్‌కు ఆయుధాలు అందుతున్నాయి. ఉక్రెయిన్ ప్ర‌జ‌ల‌కు ప్ర‌భుత్వ‌మే ఆయుధాలు ఇస్తోంది. ర‌ష్యాకు ఎట్టి ప‌రిస్థితుల్లోనూ లొంగిపోయేది లేద‌ని ఉక్రెయిన్ చెబుతోంది. ఉక్రెయిన్ వెన‌క్కి త‌గ్గేదాక దాడులు కొన‌సాగేలా ర‌ష్యా చర్య‌లు తీసుకుంటుండ‌డంతో ప్రపంచ దేశాలు ఆందోళ‌న వ్య‌క్తం చేస్తున్నాయి.

రష్యా-ఉక్రెయిన్ సమస్యల్లో జోక్యం చేసుకోవద్దని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ భారత్‌ను కోరినట్లు ఒక వార్తా బులెటిన్ కు సంబంధించిన స్క్రీన్ షాట్ సోషల్ మీడియాలో విస్తృతంగా షేర్ అవుతోంది. ఒకవేళ భారత్ జోక్యం చేసుకుంటే తీవ్ర పరిణామాలను ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాలని పుతిన్ చెప్పినట్లు వార్తా బులెటిన్ పేర్కొంది.

వైరల్ న్యూస్ బులెటిన్‌ను ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ యుఎస్ నగర్ ఉత్తరాఖండ్ జిల్లా కార్యదర్శి ట్వీట్ చేశారు. ట్వీట్‌కి రెండువేలకు పైగా రీట్వీట్‌లు, ఆరువేలు పైగా లైక్‌లు వచ్చాయి.

నిజ నిర్ధారణ :

వైరల్ అవుతున్న ఈ పోస్టుల్లో 'ఎటువంటి నిజం లేదు'.

న్యూస్ బులెటిన్ వైరల్ స్క్రీన్‌షాట్‌లో CNN న్యూస్ లోగో ఉన్నట్లు న్యూస్‌మీటర్ గమనించింది. ఆ వార్తల బులెటిన్ కోసం CNN వెబ్‌సైట్‌ని శోధించాము. అందులో ఎలాంటిది కనిపించలేదు. ఈ థంబ్ నైల్ కు సంబంధించి "Top Russian official jokes about interfering in U.S election in 2020." అంటూ ఉన్నట్లుగా కనుగొన్నాము. ఇది 12 నవంబర్ 2019న ప్రసారం చేయబడింది.

దీని నుండి క్లూగా తీసుకొని, కీవర్డ్ సెర్చ్ చేయగా 13 నవంబర్ 2019 న 'ది లీడ్ CNN' ద్వారా చేయబడిన ట్వీట్‌ ని కనుక్కున్నాము. ట్విట్టర్ వినియోగదారులు వైరల్ అయినటువంటి వార్తా బులెటిన్ యొక్క స్క్రీన్‌గ్రాబ్‌ను షేర్ చేసినట్లు గుర్తించాము.

మేము వైరల్ న్యూస్ బులెటిన్‌ను అసలైన దానితో పోల్చాము. రెండింటి మధ్య అనేక సారూప్యతలను కనుగొన్నాము. వైరల్ న్యూస్ బులెటిన్ మార్ఫింగ్ చేయబడిందని స్పష్టంగా తెలిసింది. ఉక్రెయిన్ వివాదంలో జోక్యం చేసుకోవద్దని రష్యా భారత్‌ను హెచ్చరించిందన్న వాదన తప్పు.

కాబట్టి, వైరల్ పోస్టుల్లో 'ఎటువంటి నిజం లేదు'.




Next Story