భారతదేశంలో పెట్రోల్-డీజిల్ ధరలు భారీగా పెరిగిపోతూ ఉన్న సంగతి తెలిసిందే..! ఇంధన ధరలను తగ్గించాలని పెద్ద ఎత్తున డిమాండ్ కొనసాగుతూ ఉంది. అయితే ఇంధనాన్ని ఆదా చేయాలంటే ఏటవాలుగా ఉన్న రోడ్లను నిర్మించాలని కేంద్ర మంత్రి నైతిక గడ్కరీ సూచించారంటూ ఓ వార్తా కథనానికి సంబంధించిన లింక్ సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతూ ఉంది.
'లోక్ సత్తా' మీడియా సంస్థకు సంబంధించిన వార్తా కథనం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. హిందీలో ఉన్న కథనాన్ని అనువాదం చేయగా "ఇంధన ధరల పెరుగుదలకు ప్రత్యామ్నాయంగా, దేశంలోని అన్ని రహదారులు ఏటవాలుగా చేయబడతాయి" అని అందులో ఉంది.
ఈ ఫోటోను సామాజిక మాధ్యమాల్లో వైరల్ చేస్తూ ఉన్నారు. కేంద్ర మంత్రి ఇంత వెటకారంగా మాట్లాడుతారా అంటూ పలువురు విమర్శలు గుప్పిస్తూ ఉన్నారు.
నిజ నిర్ధారణ:
వైరల్ అవుతున్న ఈ మెసేజీలో ఎటువంటి నిజం లేదు.
ఇలాంటి వ్యాఖ్యలను నితిన్ గడ్కారీ చేసినట్లుగా ఏ మీడియా కథనాలు చెప్పలేదు. ఏ మీడియా సంస్థ కూడా ఇందుకు సంబంధించిన వార్తలను ప్రసారం చేయలేదు.
ఇక న్యూస్ మీటర్ లోక్ సత్తా మీడియా సంస్థకు సంబంధించిన వార్తలను, కథనాలను పరిశీలించగా ఎక్కడా కూడా ఇలాంటి వార్త ప్రచురించలేదు. ఇక ఈ విషయం లోక్ సత్తా మీడియా సంస్థకు కూడా తెలిసింది. తాము ఇలాంటి వార్తను ప్రచురించలేదని తేల్చి చెప్పింది. ట్విట్టర్ లో తాము నితిన్ గడ్కరీ గురించి ఇలాంటి వార్తను ప్రచురించలేదని తెలిపింది.
విశ్వాస్ న్యూస్ నాగ్పూర్ లోని ఏఎన్ఐ కరస్పాండెంట్ సౌరభ్ జోషిని సంప్రదించి కేంద్ర మంత్రి అలాంటి ప్రకటన చేయలేదని ధృవీకరించారు. నితిన్ గడ్కరీ ఆన్‌లైన్ లేదా ఆఫ్‌లైన్ ఈవెంట్‌ల సమయంలో కూడా ఈ విషయం చెప్పలేదని ఆయన అన్నారు. పెట్రోల్, డీజిల్ ధరల పెరుగుదల కారణంగా ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నందున ఇథనాల్ ఉత్పత్తిని పెంచాలని గడ్కరీ సూచించారు. (మూలం: లైవ్ మింట్, హిందూస్తాన్ టైమ్స్). ఇది కాకుండా ఇతర మీడియా సంస్థలు ఇలాంటి కథనాలను తెలియజేయలేదు.
కాబట్టి కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ గురించి వైరల్ అవుతున్న ఈ వార్తల్లో 'ఎటువంటి నిజం లేదు'.