నిజామాబాద్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత బుర్జ్ ఖలీఫా భవనంలో ఫ్లాట్ కొన్నారంటూ ఓ పోస్టు వైరల్ అవుతూ ఉంది. నిజామాబాద్ శాసన మండలి సభ్యురాలు కల్వకుంట్ల కవిత తాజాగా బుర్జ్ ఖలీఫాలో ఫ్లాట్ కొనుగోలు చేసినట్లు పోస్ట్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. 60 కోట్లతో ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన మరియు అత్యంత ఖరీదైన భవనం బుర్జ్ ఖలీఫాలో ఆమె ఫ్లాట్‌ను కొనుగోలు చేసినట్లు పోస్ట్ వైరల్ అవుతోంది.
బుర్జ్ ఖలీఫా దుబాయ్‌లో ఉంటుంది. బుర్జ్ ఖలీఫా నిర్మాణం 2004 లో ప్రారంభమై 2009 లో పూర్తయింది. ఈ భవనం 2010 లో ప్రారంభించబడింది. ఈ భవనానికి మొదట 'బుర్జ్ దుబాయ్' అని పేరు పెట్టారు, కాని అబు దాబి పాలకుడు, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ అధ్యక్షుడు ఖలీఫా బిన్ జాయెద్ అల్ నహ్యాన్ గౌరవార్థం పేరు మార్చబడింది. ఈ భవనము నిర్మాణం తర్వాత ఇది అప్పటి వరకు ఉన్న పలు ప్రపంచ రికార్డులను బ్రేక్ చేసి ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన భవనంగా కొత్త రికార్డు సృష్టించింది.
ఇందులోని అపార్ట్‌మెంట్‌ను కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణ సంస్థ విరాళంగా ఇచ్చిందని, గృహప్రవేశాలకు కరీంనగర్, నిజామాబాద్ ఎమ్మెల్యేలు హాజరయ్యారని సోషల్ మీడియా వినియోగదారులు చెబుతున్నారు. గల్ఫ్ కార్మికులకు వాగ్దానాలు చేసి వాటిని నిలబెట్టుకోకుండా ఆస్తులు కొనుక్కోవడంలో ఆమె బిజీగా ఉన్నారని విమర్శిస్తూ వస్తున్నారు.
నిజ నిర్ధారణ :
ఈ వైరల్ పోస్టుల్లో ఎటువంటి నిజం లేదు.
న్యూస్ మీటర్ కల్వకుంట్ల కవిత ఆఫీసును సంప్రదించగా ఈ వార్తల్లో ఎటువంటి నిజం లేదని తెలిపారు. ఇవి తప్పుడు వార్తలని.. మరియు నిరాధారమైనవని కార్యాలయం పేర్కొంది."గౌరవనీయ ఎమ్మెల్సీకి బుర్జ్ ఖలీఫాలో ఫ్లాట్ ఉందని ఇటీవల జరిగిన దురుద్దేశపూరిత ప్రచారం మా దృష్టికి తీసుకురాబడింది. ఈ కథనాలు నిరాధారమైనవి. బతుకమ్మ సమయంలో సమిష్టిగా ఉండాల్సిన పార్టీలు.. ఇలాంటి పోస్టులతో తమ వైషమ్యాలను ప్రదర్శించారు" అని చెప్పుకొచ్చారు.
కవిత ఇటీవల దుబాయ్‌కి వెళ్లారు. అప్పటి నుండే ఈ తప్పుడు వార్తలు వచ్చాయి. బుర్జ్ ఖలీఫా వద్ద బతుకమ్మను జరుపుకున్నారు. బతుకమ్మ సంస్కృతిని ప్రదర్శించడానికి వెళ్లారు. ప్రపంచంలోనే అతిపెద్ద స్క్రీన్‌పై బతుకమ్మ పండుగను ప్రదర్శించడం ద్వారా పండుగ వేడుకలను ప్రపంచవ్యాప్తం చేసేలా తెలంగాణ జాగృతికి నాయకత్వం వహించారు కల్వకుంట్ల కవిత. దీనికి సంబంధించి పలు మీడియా సంస్థలు కథనాలను ప్రసారం చేశాయి.
అంతేకానీ ఎక్కడా కూడా కల్వకుంట్ల కవిత బుర్జ్ ఖలీఫాలో అపార్ట్మెంట్ కొనుక్కున్నారనే వార్త రాలేదు. కాబట్టి ఈ ఫోటోలు, పోస్టులు అవాస్తవాలు.. ఎటువంటి నిజం లేదు.