భారీగా జనం ఉన్న ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్‌లో కొత్తగా కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన జ్యోతిరాదిత్య సింధియాను స్వాగతించడానికి ప్రజలు పెద్ద ఎత్తున వచ్చారని సోషల్ మీడియా వినియోగదారులు తమ పోస్టుల్లో తెలిపారు.
అందుకు సంబంధించిన వీడియోలను పెద్ద ఎత్తున ప్రచారం చేశారు.
నిజ నిర్ధారణ:
వైరల్ అవుతున్న పోస్టులు తప్పు. ఇది ఇటీవలి వీడియో కాదు.
న్యూస్‌మీటర్ కీవర్డ్ సెర్చ్ చేసి చూడగా.. చాలా మంది సోషల్ మీడియా వినియోగదారులు ఈ వీడియోను సెప్టెంబర్ 2020 లో పంచుకున్నారని తెలుస్తోంది. ఇది మధ్యప్రదేశ్‌లోని మొరెనా జిల్లాలోని జౌరా అనే పట్టణంలో చోటు చేసుకుంది.
ఈ సమాచారాన్ని ఉపయోగించి, న్యూస్‌మీటర్ మరింత శోధించగా.. 2020 సెప్టెంబర్‌లో బీజేపీ నాయకుడు రఘురాజ్ సింగ్‌కు మద్దతుగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పాల్గొనడానికి ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్, వ్యవసాయ, రైతు సంక్షేమ శాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్, జ్యోతిరాదిత్య సింధియా మొరెనాను సందర్శించారు.
ముగ్గురు నాయకులు భూమిపూజను నిర్వహించారు. కొన్ని అభివృద్ధి పనులను ప్రారంభించారు. వైరల్ వీడియోలో చూసినట్లుగా జ్యోతిరాదిత్య సింధియా అప్పుడు అదే కుర్తాను ధరించారు.
ఇక కేంద్ర మంత్రి అయిన తరువాత సింధియా గ్వాలియర్‌ను సందర్శించినట్లు ఎటువంటి వార్తా నివేదికలు కనుగొనబడలేదు.
కాబట్టి వైరల్ అవుతున్న పోస్టుల్లో 'ఎటువంటి నిజం లేదు'.