ఉక్రెయిన్-రష్యా దేశాల మధ్య యుద్ధం కొనసాగుతూనే ఉంది. శాంతి ఎప్పుడు నెలకొంటుందో తెలియని పరిస్థితి. ఉక్రెయిన్ అధ్యక్షుడు వోలోడిమిర్ జెలెన్స్కీ యుఎస్ నేతృత్వంలోని నాటో మిలిటరీ కూటమిలో సభ్యత్వం పొందదని తమ దేశం అంగీకరించాలని స్పష్టం చేశారు. నాటోలో ఉక్రెయిన్ చేరకూడదనే రష్యా దాడులు చేస్తోంది. ఉక్రెయిన్ నాటోలో సభ్యుత్వం పొందలేదు. మా కోసం నాటో తలుపులు తెరిచి ఉంచాయని మేము ఎన్నో ఏళ్లుగా భావించాం. కానీ, ఇప్పుడు మాకు వాస్తవం తెలిసి వచ్చింది. ఉక్రెయిన్ ఇక నాటో సభ్యత్వం తీసుకోదు అని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్కస్కీ స్పష్టం చేశారు. ఉక్రెయిన్‌కు మద్దతుగా యూరోపియన్ యూనియన్ కీలక నిర్ణయం తీసుకుంది. రష్యా ఆక్రమణలో చిక్కుకున్న ఉక్రెయిన్ రాజధాని కీవ్‌కు నాటో సభ్య దేశాలైన చెక్ రిపబ్లిక్, స్లొవేకియా, పోలెండ్ లీడర్లను మంగళవారం పంపాలని నిర్ణయించింది. ఉక్రెయిన్ స్వేచ్ఛ, స్వాతంత్ర్యం విషయంలో ఈయూ మద్దతును తెలియజేయడమే తమ పర్యటన లక్ష్యమని చెక్ ప్రధాన మంత్రి పీటర్ ఫియాలా ట్వీట్ చేశారు. ఈయూ మిషన్‌లో భాగంగా ఆయనతోపాటు స్లొవేకియా ప్రధాని జానెజ్ జాన్సా, పోలెండ్ ప్రధాని మాటెయుస్జ్ మొరావీకి, పోలెండ్ డిప్యూటీ ప్రధాని జార్‌స్లా కక్జిన్‌స్కీ తదితరులు వెళ్లనున్నారు.
మరో వైపు పలువురు క్రీడాకారులు ఉక్రెయిన్ సైన్యంలో చేరుతున్నారని, సెలెబ్రిటీలు కూడా ఆ దేశ సైన్యంలో భాగమయ్యారనే వార్తలను మనం వింటూ ఉన్నాం. మాజీ మిస్ ఉక్రెయిన్ అనస్తాసియా లెన్నా రష్యాపై పోరాడేందుకు సైన్యంలో చేరిందని సోషల్ మీడియా వినియోగదారులు పేర్కొంటున్నారు.
నిజ నిర్ధారణ :
వైరల్ అవుతున్న పోస్టుల్లో ఎటువంటి నిజం లేదు.
NewsMeter ఒక కీవర్డ్ సెర్చ్ ను నిర్వహించడం ద్వారా పరిశోధనను ప్రారంభించింది. మార్చి 01, 2022న Facebook పేజీ 'Tamil The Hindu'లోని ఒక పోస్ట్‌కి దారితీసింది.
క్యాప్షన్ లో "నేను సైన్యంలో చేరలేదు: మాజీ మిస్ ఉక్రెయిన్ వివరణ." అని ఉంది.
మాజీ మిస్ ఉక్రెయిన్ ఆర్మీ యూనిఫాం ధరించిన తన చిత్రాన్ని ఫిబ్రవరి 23, 2022న ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసిన తర్వాత ఈ వార్త వైరల్ అయింది. ఫిబ్రవరి 28, 2022న, తాను ఉక్రేనియన్ సైన్యంలో చేరలేదని స్పష్టం చేసింది. ఉక్రేనియన్ ప్రజలకు స్ఫూర్తినిచ్చేలా పోస్ట్ పెట్టానని మాత్రమేనని తెలిపింది.
ది ఇండియన్ ఎక్స్‌ప్రెస్ నివేదికలో మాజీ మిస్ ఉక్రెయిన్ సైన్యంలో చేరలేదని పేర్కొంది. "అనస్తాసియా లెన్నా ఒక ఎయిర్‌సాఫ్ట్ తుపాకీని కలిగి ఉంది, ఇది అసాల్ట్ రైఫిల్ కాదు" అని దినపత్రిక పేర్కొంది.
కాబట్టి, వైరల్ అవుతున్న పోస్టుల్లో ఎటువంటి నిజం లేదు. మాజీ మిస్ ఉక్రెయిన్ సైన్యంలో చేరలేదు.