సోషల్ మీడియాలో ఓ 75 సంవత్సరాల వ్యక్తి 15 సంవత్సరాల కుమార్తెను పెళ్లి చేసుకున్నాడంటూ పోస్టులు వైరల్ చేస్తూ ఉన్నారు. కుమారుడు కలగాలనే ఆకాంక్షతో సదరు వ్యక్తి సొంత కూతురినే పెళ్లి చేసుకోవాలని అనుకున్నాడంటూ పోస్టులను వైరల్ చేస్తూ ఉన్నారు.
నిజ నిర్ధారణ:
వైరల్ అవుతున్న వార్తలో ఎటువంటి నిజం లేదు.
వైరల్ అవుతున్న పోస్టును రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేయగా.. ఇండియా టుడేలో ఆగష్టు 18, 2017న ఒక ఆర్టికల్ ను రాశారు. `Sheikh marries minor: Practice continues in Hyderabad even 26 years after Ameena case' హైదరాబాద్ లో ఒక షేక్ మైనర్ ను పెళ్లి చేసుకున్నాడని అందులో ఉంది.
16 సంవత్సరాల అమ్మాయిని ఒమన్ నుండి కాపాడాలని అప్పటి యూనియన్ మినిస్టర్ ఫర్ విమెన్ అండ్ చైల్డ్ డెవెలప్మెంట్ మనేక గాంధీ విదేశీ వ్యవహారాల శాఖా మంత్రి సుష్మా స్వరాజ్ ను కోరారు. 16 సంవత్సారాల అమ్మాయి 65 సంవత్సరాల ఒమన్ కు చెందిన వ్యక్తిని పెళ్లి చేసుకుందని ఆ యువతి తల్లిదండ్రులు పోలీసులను ఆశ్రయించారు.
హిందుస్థాన్ టైమ్స్ లో ఆగష్టు 18, 2017న మరో వార్తా కథనం కూడా కనిపించింది.
ఓమన్ రాజధాని మస్కట్‌లో తన అరబ్ భర్త షేక్ అహ్మద్ చేత శారీరకంగా హింసించబడుతున్నానని తన కుమార్తె నుండి ఇటీవల ఫోన్ కాల్ వచ్చిందని ఓల్డ్ సిటీకి చెందిన నవాబ్ సాహెబ్ కుంటా నివాసి సయీదా ఉన్నిసా ఫలక్నుమా పోలీసులకు ఫిర్యాదు చేసింది. తన కుమార్తె భారతదేశానికి తిరిగి రావాలని అనుకుంటూ ఉందని వారు తెలిపారు.
"కుమార్తెను తిరిగి హైదరాబాద్ కు పంపమని ఆమె విజ్ఞప్తి చేసినప్పుడు, అతను సికందర్ కు 5 లక్షల రూపాయలు చెల్లించి ఆమెను కొన్నానని, ఆ మొత్తాన్ని తనకు తిరిగి ఇచ్చిన తర్వాత మాత్రమే ఆమెను తిరిగి పంపిస్తామని చెప్పాడు" బాధితురాలి తల్లి పోలీసులకు తెలిపింది.
రంజాన్ పండుగకు కొద్ది రోజుల ముందు తన ఆడపడుచు గౌసియా భర్త సికందర్ తన కుమార్తెను ఒమానీ జాతీయుడికి ఇచ్చి వివాహం చేసినట్లు సయీదా తెలిపారు. తన కుమార్తెకు ఆ వ్యక్తితో వివాహం ఇష్టం లేదు.. తల్లిదండ్రుల అంగీకారం కూడా లేదు. కానీ సికందర్, గౌసియా తన కుమార్తె మస్కట్లో విలాసవంతమైన జీవితాన్ని గడుపుతుందని ఒప్పించి అతడి విలాసవంతమైన జీవనశైలికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు చూపించి ఒప్పించారని బాధితురాలి తల్లి వెల్లడించారు.
కాబట్టి సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నట్లుగా 75 సంవత్సరాల వ్యక్తి 15 సంవత్సరాల సొంత కుమార్తెను పెళ్లి చేసుకున్నాడంటూ వైరల్ అవుతున్న పోస్టుల్లో ఎటువంటి నిజం లేదు. వైరల్ అవుతున్న పోస్టులో ఉన్న అమ్మాయి వయసు 16.. ఆమె ఒమన్ కు చెందిన షేక్ కు ఇచ్చి బలవంతపు వివాహం చేశారు.