ఒక వాహనం చుట్టూ భారీగా ప్రజలు గూమిగూడిన ఫోటో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. అఖిల భారత మజ్లిస్-ఎ-ఇట్టేహాదుల్ ముస్లిమీన్ (AIMIM) చీఫ్ అసదుద్దీన్ ఒవైసీని స్వాగతించడానికి ఘజియాబాద్ లోని ఉత్తర ప్రదేశ్ గేట్ వద్ద జనం పెద్ద ఎత్తున వచ్చారంటూ సామాజిక మాధ్యమాల్లో ఓ పోస్టులు పెడుతూ ఉన్నారు.
"అసదుద్దీన్ ఒవైసీని స్వాగతించడానికి వచ్చిన జనం.. ఘజియాబాద్ నుండి తీసిన ఫోటో" అని వైరల్ అవుతున్న పోస్టు ఇది. ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ ఇటీవలే ఉత్తరప్రదేశ్ కు వెళ్లారు. ఆ సందర్భంలో తీసిన ఫోటో ఇదంటూ సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెద్ద ఎత్తున వెలిశాయి.
ఇది రాబోయే 2022 ఉత్తర ప్రదేశ్ ఎన్నికల నేపథ్యంలో ఆయనకు దక్కిన ఘన స్వాగతం అని చెప్పుకొచ్చారు.
నిజ నిర్ధారణ:
వైరల్ అవుతున్న పోస్టుల్లో 'ఎటువంటి నిజం లేదు'. వీడియోకు ఉత్తర్ ప్రదేశ్ కు ఎటువంటి సంబంధం లేదు.
న్యూస్ మీటర్ ఈ వీడియో బంగ్లాదేశ్ కు చెందినదిగా గుర్తించింది. బంగ్లాదేశ్‌లోని చిట్టగాంగ్‌లో జాష్నే జూలూస్ ఈద్ ఇ మిలాదున్నబి ఊరేగింపు సమయంలో తీసిన యూట్యూబ్ వీడియోను న్యూస్‌మీటర్ కనుగొంది. ఇది 2019 సంవత్సరానికి చెందినది. వీడియో లోని కొన్ని ఫ్రేమ్‌లు వైరల్ చిత్రంతో సరిపోలుతాయి.
2019లో ఫేస్ బుక్ లో పెట్టిన పోస్టును కూడా చూడొచ్చు. ఈ ఫోటోలు చిట్టగాంగ్ కు చెందినవని స్పష్టంగా తెలుస్తోంది.
ఊరేగింపుకు సంబంధించిన ఇలాంటి చిత్రాన్ని బంగ్లాదేశ్‌లోని ప్రముఖ ఆంగ్ల వార్తాపత్రిక డైలీ సన్ 2019 నివేదికలో ప్రచురించింది. "పవిత్ర ఈద్-ఎ-మిలాదున్నబిని ఆచరించడానికి ఆదివారం వేలాది మంది ముస్లిం భక్తులు చత్తోగ్రామ్ (చిట్టగాంగ్) లోని లల్ఖాన్ బజార్ ప్రాంతంలో 'జాష్నే జూలుష్' ఊరేగింపులో పాల్గొన్నారు అని ఉంది.
వీటిని బట్టి వైరల్ చిత్రం ఇటీవలిది కాదని స్పష్టంగా తెలుస్తోంది. అసదుద్దీన్ ఒవైసి ఉత్తరప్రదేశ్ సందర్శనతో ఈ ఫోటోకు ఎటువంటి సంబంధం లేదు. వైరల్ అవుతున్న పోస్టుల్లో 'ఎటువంటి నిజం లేదు'.