ఇద్దరు వ్యోమగాములు చంద్రుని ఉపరితలంపై ప్రవేశించడాన్ని చూపించే వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉంది. చంద్రయాన్-3లోని శాస్త్రవేత్తలు చంద్రునిపైకి చేరుకున్నారని, అక్కడ కొత్త విషయాలను కనుగొన్నారని వినియోగదారులు పేర్కొన్నారు.
ఇస్రో ప్రకారం చంద్రయాన్ 3 ప్రయాణంలో మరో కీలక, క్లిష్టమైన ముందడుగు ఆగస్టు 16న పడింది. చంద్రుడి చుట్టూ చేస్తున్న భ్రమణంలో చివరిదైన, చంద్రుడికి మరింత సమీపంలో ఉన్న ఐదవ కక్ష్యలోకి చంద్రయాన్ విజయవంతంగా చేరుకుంది. దీంతో చంద్రుడి చుట్టూ చేస్తున్న పరిభ్రమణాల్లో కక్ష్యల మార్పు కార్యక్రమం ముగిసినట్లే..! ల్యాండర్ మాడ్యూల్, ప్రొపల్షన్ మాడ్యుల్ లు విడిపోయి, వేరువేరుగా ప్రయాణం సాగించే మరో కీలక ఘట్టానికి చంద్రయాన్ సిద్ధమవుతోంది. చంద్రయాన్ 3 ని విజయవంతగా చంద్ర కక్ష్యలోకి ప్రవేశపెట్టడమనే కీలక ఘట్టం ముగిసిందని ఇస్రో తెలిపింది. ఈ కార్యక్రమం పూర్తిగా ఆశించిన తీరులోనే కొనసాగిందని ఇస్రో ప్రకటించింది. ల్యాండర్ మాడ్యూల్, ప్రొపల్షన్ మాడ్యుల్ లు విడిపోయే కార్యక్రమం ఆగస్ట్ 17వ తేదీన జరుగుతుంది.
చంద్రయాన్-3 కి సంబంధించి అంతరిక్ష నౌక చంద్రుని దక్షిణ-ధ్రువ ప్రాంతానికి సమీపంలో దిగడానికి సిద్ధంగా ఉంది, కొత్త అన్వేషణలకు శ్రీకారం చుట్టబోతున్నట్లు ఇస్రో శాస్త్రవేత్తలు నమ్ముతున్నారు.
నిజ నిర్ధారణ :
న్యూస్‌మీటర్ వైరల్ వీడియో 2011 హాలీవుడ్ చిత్రం 'ట్రాన్స్‌ఫార్మర్స్ 3 - డార్క్ ఆఫ్ ది మూన్' లోనిదని కనుగొంది. చంద్రయాన్-3 మానవ రహిత మిషన్. వ్యోమగాములు ఎవరూ అందులో లేరు.
వీడియో కీఫ్రేమ్స్ రివర్స్ ఇమేజ్ సెర్చ్‌లో, మేము డిసెంబర్ 10, 2010న ధృవీకరించబడిన YouTube ఛానెల్ ‘moviemaniacsDE’లో అప్‌లోడ్ చేసిన హాలీవుడ్ సినిమా ట్రాన్స్‌ఫార్మర్ 3 యొక్క ట్రైలర్‌ని చూశాము. వైరల్ క్లిప్ 1.10 నిమిషాల తర్వాత ట్రైలర్‌లో కనిపిస్తుంది.
జూన్ 18, 2014న మరో YouTube ఛానెల్ ‘రాటెన్ టొమాటోస్ క్లాసిక్ ట్రైలర్స్’ ప్రచురించిన ట్రాన్స్‌ఫార్మర్ 3 ట్రైలర్‌లో కూడా మేము అదే విజువల్స్ కనుగొన్నాము. “ట్రాన్స్‌ఫార్మర్స్: డార్క్ ఆఫ్ ది మూన్ (2011) అధికారిక ట్రైలర్” అని క్యాప్షన్ ఉంది.
అందువల్ల, వైరల్ క్లిప్ ట్రాన్స్‌ఫార్మర్స్ 3 - డార్క్ ఆఫ్ ది మూన్ సినిమాకు సంబంధించినదని మేము నిర్ధారించాము. ఇది ట్రాన్స్ఫార్మర్స్ సిరీస్‌లోని మూడవ చిత్రం, ఈ సినిమా 2011లో విడుదలైంది. కాబట్టి, వైరల్ అవుతున్న వాదనలో ఎటువంటి నిజం లేదు.
Credits : Md Mahfooz Alam