భారతదేశంలోని 100 మిలియన్ల యూజర్ల కోసం కేంద్ర ప్రభుత్వం ఉచితంగా డేటా ఇవ్వబోతోందనే ప్రచారం సాగుతోంది. మూడు నెలల పాటూ విద్యార్థుల ఆన్ లైన్ క్లాసుల కోసం కేంద్ర ప్రభుత్వం ఈ ఉచిత డేటా ఇవ్వబోతోందని ప్రచారం జరుగుతూ ఉంది.
జియో, ఎయిర్ టెల్, వి కి చెందిన కష్టమర్లకు ఈ ఆఫర్ అందుబాటులో ఉందంటూ పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. పలువురు తమ తమ సోషల్ మీడియా అకౌంట్లలో ఈ పోస్టులను చేస్తున్నారు.
నిజ నిర్ధారణ:
విద్యార్థుల ఆన్ లైన్ క్లాసుల కోసం కేంద్ర ప్రభుత్వం ఉచితంగా ఇంటర్నెట్ ను అందిస్తోందంటూ జరుగుతున్న ప్రచారంలో 'ఎటువంటి నిజం లేదు'.
ఉచితంగా ఇంటర్నెట్ ను ఇస్తామంటూ కేంద్ర ప్రభుత్వం ఎటువంటి ప్రకటన కూడా చేయలేదు. ఇందుకు సంబంధించిన వార్తల కోసం వెతుకగా ఎక్కడ కూడా ఆధారాలు లభించలేదు. మీడియాలో కూడా ఇందుకు సంబంధించిన వార్తలు రాలేదు.
ప్రముఖ టెలికాం ఆపరేటర్ జియో కూడా ఈ ప్రచారంపై స్పందించింది. ఎలాంటి ఉచిత ఇంటర్నెట్ ఆఫర్ కూడా ఇవ్వలేదని తెలిపింది. ఇలాంటి సమాచారాన్ని అసలు పట్టించుకోకండి అంటూ సోషల్ మీడియా ద్వారా తెలిపింది. కొందరు వ్యక్తిగత సమాచారాన్ని తెలుసుకోవడం కోసం ఇలాంటి లింకులను షేర్ చేస్తూ ఉంటారని.. పొరపాటున కూడా క్లిక్ చేయకూడదని తెలిపింది. మీ మొబైల్ ఫోన్ లో ఉండే ముఖ్యమైన డేటా దొంగిలించబడే అవకాశం ఉందని జియో సంస్థ హెచ్చరించింది.
హైదరాబాద్ లోని ఎయిర్ టెల్ స్టోర్ ను న్యూస్ మీటర్ సంప్రదించగా ఈ వైరల్ మెసేజ్ ఫేక్ అని తేల్చి చెప్పారు. మూడు నెలల పాటూ ఉచిత ఇంటర్నెట్ అంటూ వైరల్ అవుతున్న మెసేజీ 'ఫేక్' అని చెప్పారు.
వైరల్ మెసేజీలో ఉన్న లింక్ ద్వారా వ్యక్తిగత సమాచారం ఇతరుల చేతిలోకి వెళ్లే అవకాశం ఉందని నిపుణులు కూడా హెచ్చరిస్తూ ఉన్నారు. ఇలాంటి ఫ్రాడ్ మెసేజీలను క్లిక్ చేయకూడదని.. ఇతరులకు కూడా ఫార్వర్డ్ చేయకండని హెచ్చరించారు. పిఐబి ఫ్యాక్ట్ చెక్ మీడియా సంస్థ కూడా ఈ వైరల్ మెసేజీలో ఎటువంటి నిజం లేదని తేల్చి చెప్పింది. ప్రభుత్వం ఎటువంటి ప్రకటన కూడా ఇవ్వలేదని స్పష్టం చేసింది. కాబట్టి సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్న పోస్టుల్లో 'ఎటువంటి నిజం లేదు'.