భారతదేశం లోనే సంపన్నుల కుటుంబం ఏదంటే ముకేశ్ అంబానీ కుటుంబం అని చెబుతారు. ఇటీవలే ముకేశ్ అంబానీకి మనవడు జన్మించాడు. అందుకు సంబంధించిన పోస్టులు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయ్యాయి. తమకు ఎంతో ఆనందంగా ఉందని అంబానీ కుటుంబం తెలిపింది.
ఈ సందర్భంగా ఓ ప్రత్యేక కార్యక్రమాన్ని అంబానీ కుటుంబం నిర్వహించిందంటూ సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెడుతూ ఉన్నారు. ఈ కార్యక్రమానికి బాలీవుడ్ సెలెబ్రిటీలు, రాజకీయ నాయకులు హాజరయ్యారంటూ అందులో చెప్పారు. పెద్ద ఎత్తున ఈ కార్యక్రమం నిర్వహించారని అందులో తెలిపారు. అంబానీ మనవడికి స్వాగతం తెలపడానికి ఇంత పెద్ద స్థాయిలో కార్యక్రమాన్ని నిర్వహించారా అని పలువురు ఆశ్చర్యపోతున్నారు. కోవిద్-19 నిబంధనలను కూడా తుంగలోకి తొక్కారు అంటూ ఆరోపణలు గుప్పించారు.
నిజ నిర్ధారణ:
న్యూస్ మీటర్ ఈ వీడియోను పరిశీలించగా ముకేశ్ అంబానీ మనవడు పుట్టాడని ఈవెంట్ ను ఏర్పాటు చేశారంటూ సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్న పోస్టుల్లో ఎటువంటి నిజం లేదు.
ఇది ఇప్పటి ఈవెంట్ కాదు. 2019లో ముకేశ్ అంబానీ కుటుంబం గణేష్ చతుర్థి కార్యక్రమాన్ని నిర్వహించింది. అందుకు సంబంధించిన వీడియో అని స్పష్టమవుతోంది.
BOLLYWOOD NOW, BOLLYWOOD HEADLINES యుట్యూబ్ ఛానల్స్ లో ఈ కార్యక్రమానికి సంబంధించిన వీడియోలను గమనించవచ్చు. గణేష్ చతుర్థి సందర్భంగా నిర్వహించిన ఈ కార్యక్రమంలో పలువురు బాలీవుడ్ స్టార్స్ హాజరు అయ్యారు. ముకేశ్ అంబానీకి చెందిన అంటిలా లో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. రేఖ, అమితాబ్, మాధురి దీక్షిత్, ఆమిర్ ఖాన్ లాంటి బాలీవుడ్ సెలెబ్రిటీలు హాజరయ్యారు. మహారాష్ట్రకు చెందిన పలువురు రాజకీయ నాయకులు కూడా కార్యక్రమంలో పాల్గొనడాన్ని వీడియోలను గమనించవచ్చు.
భారత్ లో కోవిద్-19 గైడ్ లైన్స్ మార్చి 2020 నుండి మొదలవ్వగా.. ఈ కార్యక్రమాన్ని సెప్టెంబర్ 2019న నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కోవిద్ నిబంధనలకు ఎటువంటి సంబంధం లేదు.
ముకేశ్ అంబానీ మనవడు పుట్టాడని ఈవెంట్ ను ఏర్పాటు చేశారంటూ సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్న పోస్టులు పచ్చి అబద్ధం.