బీబీసీ న్యూస్ హిందీ చేసిన ట్వీట్‌కు సంబంధించిన స్క్రీన్ షాట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆ ట్వీట్ ప్రకారం, బాలీవుడ్ సినిమా బ్రహ్మాస్త్ర నిర్మాత కరణ్ జోహార్ రూ. 5 కోట్లు పాకిస్థాన్ కోసం విరాళం ప్రకటించగా.. చిత్రంలోని లీడ్ పెయిర్ అలియా భట్, రణబీర్ కపూర్ ఒక్కొక్కరు కోటి రూపాయలు విరాళంగా ఇవ్వబోతున్నారని అందులో చెప్పారు. వరదలతో అతలాకుతలమైన పాకిస్థాన్‌కు సహాయం చేసేందుకు.. తమ సినిమా హిట్ అయితే మరో రూ.51 కోట్లు విరాళం ఇస్తానని హామీ ఇచ్చారని పేర్కొంది.
ఈ శతాబ్దపు అత్యంత దారుణమైన వరదల కారణంగా పాకిస్థాన్ లో ఎన్నో ప్రాంతాలు అతలాకుతలం అయ్యాయి. దేశంలోని మూడింట ఒక వంతు ప్రాంతం రికార్డు స్థాయిలో వర్షపాతం కారణంగా మునిగిపోయింది.
నిజ నిర్ధారణ :
న్యూస్‌మీటర్ వైరల్ అవుతున్న ట్వీట్ లో ఎన్నో తప్పులను కనుగొంది. బ్రహ్మాస్త్ర సినిమాలోని ప్రధాన నటుడు రణబీర్ కపూర్‌ని రణవీర్ కపూర్‌గా తప్పుగా చూపించారు. మేము ట్వీట్ టెంప్లేట్‌లో ఉన్న వ్యత్యాసాలను కూడా గమనించాము.
వైరల్ ట్వీట్ యొక్క టెంప్లేట్‌ను Android, iOS, Twitter వెబ్, TweetDeck టెంప్లేట్‌తో పోల్చినప్పుడు మేము తేదీ, ఇతర వాటిలో తేడాలను కనుగొన్నాము. వైరల్ ట్వీట్ అసలు టెంప్లేట్‌ల ఫార్మాట్‌తో సరిపోలలేదు. వైరల్ ట్వీట్‌లో సమయం, తేదీ.. వంటి ఎన్నో తేడాలను చూశాం.
బీబీసీ హిందీ పేరుతో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ట్వీట్ ఫేక్ అని బీబీసీ స్పష్టం చేసింది. "పాకిస్తాన్ లో వరదల కారణంగా రణబీర్ కపూర్, అలియా భట్ నటించిన బ్రహ్మాస్త్ర గురించి ఒక నకిలీ ట్వీట్ BBC హిందీ పేరుతో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ ట్వీట్ ఫేక్, అలాంటి ట్వీట్ లేదా అలాంటి వార్తలను BBC హిందీ ప్రచురించలేదు." అని తెలిపింది.
కాబట్టి, వైరల్ అవుతున్న పోస్టుల్లో 'ఎటువంటి నిజం లేదు'.