కొద్దిరోజుల కిందట తెలంగాణ బీజేపీ ఓ ట్వీట్ ను పోస్టు చేసింది. "అక్రమ చొరబాటుదారులకు @trspartyonline @aimim_national కలిసి మద్దతిస్తున్నాయి. అక్రమ చొరబాటుదారులు ఓటర్ లిస్టుల్లో కూడా ఉండడం ఆందోళన కలిగిస్తోంది. రోహింగ్యాలను ఓటర్ లిస్టులో చేర్చమని ఎంఐఎం కేంద్రానికి లేఖ కూడా రాసింది. - @smritiirani డిటైల్స్" అన్నది ఆ ట్వీట్ సారాంశం.
భారతదేశం లోకి అక్రమంగా చొరబడిన వారికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, ఎంఐఎం పార్టీలు మద్దతు ఇస్తూ ఉన్నాయని.. అంతేకాకుండా రోహింగ్యాలను ఓటర్ల లిస్టులో చేర్చాలని ఎంఐఎం కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాసిందని స్మృతి ఇరానీ చెప్పినట్లుగా ఆ ట్వీట్ లో ఉంది.
నిజ నిర్ధారణ:
రోహింగ్యాలను ఓటర్ల లిస్టులో చేర్చాలంటూ ఎంఐఎం పార్టీ లేఖ రాసిందంటూ వైరల్ అవుతున్న ట్వీట్ 'పచ్చి అబద్ధం'.
ఎంఐఎం నేతలు తాము ఎప్పుడూ కేంద్ర ప్రభుత్వానికి ఆ విధంగా లేఖ రాయలేదని చెప్పుకొచ్చారు. న్యూస్ మీటర్ ఈ విషయంపై ఎంఐఎం నేతలను సంప్రదించగా ఈ వార్తలను కొట్టి పడేస్తున్నామని వెల్లడించారు. ఏఐఎంఐఎం పార్టీ కేంద్ర ఎన్నికల కమీషన్ కు రోహింగ్యాలను ఓటర్ల లిస్టులో చేర్చాలంటూ ఎటువంటి లేఖ కూడా రాయలేదని స్పష్టం చేశారు.
Deccan Chronicle, Times Now మీడియా సంస్థల కథనాల ప్రకారం ఎంఐఎం ప్రెసిడెంట్ అసదుద్దీన్ ఒవైసీ కూడా ఈ వ్యాఖ్యలను ఖండించారు. 40000 మంది రోహింగ్యాలను ఓటర్ల లిస్టులో చేర్చారని బీజేపీ నేత వ్యాఖ్యలు చేయగా.. 100 మంది రోహింగ్యాలు ఓటర్ల లిస్టులో చూపించాలని సవాల్ విసిరారు. భారతీయ జనతా పార్టీ అబద్ధపు ప్రచారం చేస్తోందంటూ విమర్శలు గుప్పించారు అసదుద్దీన్.
రోహింగ్యాలను ఓటర్ల లిస్టులో చేర్చమంటూ కేంద్ర ప్రభుత్వాన్ని ఎంఐఎం పార్టీ కోరిందంటూ వైరల్ అవుతున్న పోస్టుల్లో ఎటువంటి నిజం లేదు.