ఓ వైపు బహిష్కరించాలని పిలుపులు.. మరో వైపు భారీ అడ్వాన్స్ బుకింగ్స్ మధ్య షారుఖ్ ఖాన్ 'పఠాన్' జనవరి 25న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మీడియా కథనాల ప్రకారం, ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద రికార్డు స్థాయి కలెక్షన్లను సాధిస్తోంది.
ఈ నేపథ్యంలో హరిద్వార్‌లోని పెంటగాన్ మాల్‌లో 'పఠాన్' చూడటానికి భారీ ప్రజలు వస్తున్నారని చూపిస్తూ ఒక మాల్‌లో భారీ జనసమూహం ఉన్న వీడియో షేర్ చేస్తున్నారు.
నిజ నిర్ధారణ :
ఈ వీడియో 2022 నాటిదని, కేరళలోని లులూ మాల్‌లో పెద్ద సంఖ్యలో జనం ఉన్నారని న్యూస్‌మీటర్ కనుగొంది.
వీడియో యొక్క కీఫ్రేమ్స్ ను రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేయగా.. 12 జూలై 2022న NDTV ద్వారా అప్లోడ్ చేసిన YouTube వీడియోని చూసాం. వీడియో పేరు “కేరళ మాల్ మిడ్‌నైట్ సేల్ షాక్స్ ఇంటర్నెట్” అని ఉంది. 50% డిస్కౌంట్ అంటూ ప్రకటన రావడంతో.. కేరళలోని లులూ మాల్‌కి వేలాది మంది తరలివచ్చారు.
News18 కేరళ అదే వీడియోను 9 జూలై 2022న ప్రచురించింది. దాని శీర్షిక “తిరువనంతపురం లులు మాల్‌లో మిడ్ నైట్ సేల్ కారణంగా వచ్చిన భారీ జనసమూహం” అని ఉంది.
మేము 10 జూలై 2022న మింట్ నివేదికకు సంబంధించిన వీడియో స్టిల్‌ను కూడా కనుగొన్నాము. మిడ్ నైట్ సేల్ లో భాగంగా అన్ని వస్తువులపై 50% తగ్గింపును అందించిన తర్వాత తిరువనంతపురం, కొచ్చిలోని లులు మాల్ అవుట్‌లెట్‌ల వద్ద పెద్ద సంఖ్యలో కొనుగోలుదారులు వచ్చారు. అర్ధరాత్రి సేల్ లో భాగంగా 11.59 గంటల నుంచి తెల్లవారుజాము వరకు ఓపెన్ చేశారు.
ఈ వీడియో జూలై 2022 నాటిదని.. అర్ధరాత్రి సేల్ సమయంలో కేరళలోని లులు మాల్ కు ప్రజలు ఎగబడ్డారని స్పష్టంగా తెలుస్తోంది. వైరల్ వీడియోలో 'పఠాన్' చూడటానికి ప్రజలు వేచి ఉన్నారని చూపుతున్న వాదనలో నిజం లేదని మేము నిర్ధారించాము.