భారీ అలలు తీరం వెంబడి కేరింతలు కొడుతున్న వ్యక్తులను లాక్కెళ్లిపోతున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉంది. చాలా మంది సోషల్ మీడియా వినియోగదారులు ఈ వీడియోను షేర్ చేసి ఇటీవలి బిపార్జోయ్ తుఫానుకు సంబంధించినదని చెప్పుకొచ్చారు. భారీ అలలు క్షణాల్లో ఒక కుటుంబాన్ని సముద్రంలోకి లాక్కుని వెళుతున్నట్లు ఆ వీడియో చూపిస్తుంది.
బీచ్‌లో ఆనందంగా ఎంజాయ్ చేస్తున్న కుటుంబసభ్యులకు ఈ ఘటన విషాదంగా మారింది. అయితే ఇది బిపార్జోయ్ తుఫానుకు సంబంధించినదా కాదా అనేది తెలుసుకుందాం.
నిజ నిర్ధారణ :
NewsMeter బృందం ఈ వైరల్ వాదనలో ఎటువంటి నిజం లేదని గుర్తించింది.
రివర్స్ ఇమేజ్ సెర్చ్‌ను చేయగా.. జూలై 14, 2022 నాటి ఇండియా టుడే అధికారిక YouTube ఛానెల్‌లో అప్‌లోడ్ చేసిన అదే వీడియోను మేము కనుగొన్నాము. ఈ సంఘటన జరిగి ఒక సంవత్సరం అవుతోంది. ఇటీవలి తుఫానుతో ఈ ఘటనకు ఎటువంటి సంబంధం లేదు.
వైరల్ వీడియోకు “WATCH: Indian Family Swept Away By Violent Waves On Oman's Mughsail Beach,” అనే టైటిల్ ను ఉంచారు. దీన్ని బట్టి ఈ వీడియో భారత్ కు చెందినది కాదని ఒమన్ కు చెందినదని తెలుస్తోంది.
దీన్ని ఒక క్యూగా తీసుకుని, మేము కీవర్డ్ శోధనను నిర్వహించాము. ట్రిబ్యూన్ ఇండియా, ది ఇండియన్ ఎక్స్‌ప్రెస్, గల్ఫ్ న్యూస్ వంటి బహుళ మీడియా వెబ్‌సైట్‌లలో అదే నివేదికను కనుగొన్నాము.
ట్రిబ్యూన్ ఇండియాలోని నివేదిక ప్రకారం.. మహారాష్ట్రలోని సాంగ్లీకి చెందిన ఒక కుటుంబంలోని ముగ్గురు సభ్యులు ఒమన్‌లోని సలాహ్ అల్-ముగ్‌సైల్ తీరంలో కొట్టుకుపోయారు. ఇద్దరు పిల్లలతో పాటూ తండ్రి కూడా చనిపోయాడని తెలిపారు.
12 జూలై 2022 నాటి అల్ అరేబియా ఇంగ్లీష్ అధికారిక ట్విట్టర్ హ్యాండిల్‌లో అప్‌లోడ్ చేయబడిన అదే వీడియోను కనుగొన్నాం. మూలాల ప్రకారం అదే నివేదికను కలిగి ఉన్నట్లు మేము గుర్తించాం.
ట్వీట్ లో “Watch: A family is swept away by a giant wave on #Oman’s Mughsail beach after eight members reportedly crossed the beach’s boundary fence.” అని ఉంది. ముగ్‌సైల్ బీచ్‌లో ఎనిమిది మంది కుటుంబ సభ్యులు బీచ్ సరిహద్దు కంచెను దాటి వెళ్లారు. ఒక్కసారిగా వచ్చిన భారీ అలల కారణంగా వారు కొట్టుకుపోయారని తెలియజేశారు. సెల్ఫీలు తీసుకోవాలని ఆ కుటుంబం చేసిన ప్రయత్నం తీరని విషాదాన్ని నింపింది.
ఒమన్‌లోని ముగ్‌సైల్ బీచ్‌లో జరిగిన వైరల్ వీడియోను బిపార్జోయ్ తుఫానుకు సంబంధించినదిగా పోస్టు చేస్తున్నారని న్యూస్‌మీటర్ ధృవీకరించింది.
కాబట్టి, వైరల్ అవుతున్న వాదనల్లో ఎటువంటి నిజం లేదు.
Credits : Sunanda Naik