కర్ణాటక రాష్ట్రంలో నాగర్‌బెట్టలో ముస్లింలను పోలీసులు కొట్టినట్లు చూపించే వీడియో ఆన్‌లైన్‌లో వైరల్ అవుతూ ఉంది.
"నాగ పంచమి సందర్భంగా, మా పోలీసులు నాగరబెట్ట పూజను ఎంతో ఉత్సాహంగా జరుపుకున్నారు, వారికి నేను నమస్కరిస్తున్నాను" అనే శీర్షికతో ఒక X వినియోగదారు వీడియోను పంచుకున్నారు.
పలు సోషల్ మీడియా సైట్లలో ఈ వీడియోను వైరల్ చేశారు.
నిజ నిర్ధారణ:
న్యూస్‌మీటర్ వైరల్ అవుతున్న వాదనలో ఎలాంటి నిజం లేదని కనుగొంది.
రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేయగా.. మార్చి 26, 2020 నాటి 'న్యూస్18' నివేదికను మేము గమనించాం. ‘వీడియో: లాక్‌డౌన్ సమయంలో నమాజ్ చేశారు, మసీదు నుండి బయటకు వచ్చిన వారిపై పోలీసులు లాఠీచార్జి చేశారు’ అనే శీర్షికతో న్యూస్18 నివేదికను అందించింది. ఈ నివేదికకు సంబంధించిన ఫోటోలో వీడియో నుండి తీసుకున్న స్క్రీన్ షాట్ ఉంది.
నివేదిక ప్రకారం, కర్ణాటకలోని బెళగాంలో ఈ ఘటన చోటు చేసుకుంది. లాక్‌డౌన్ ఆదేశాలు ఉన్నప్పటికీ నమాజ్ చేయడానికి ఒక సమూహం మసీదు వద్ద గుమిగూడినప్పుడు ఈ సంఘటన జరిగింది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని లాఠీచార్జి చేసి జనాన్ని చెదరగొట్టారు. ఈ వీడియో పాతదని తెలుస్తోంది.
కీవర్డ్ సెర్చ్ చేయగా The Economic Times ఫేస్ బుక్ పేజీలో వీడియోను అప్లోడ్ చేశారు. “Police lathicharge people gathered at Mosque amid lockdown in Belgaum | #CoronavirusLockdown #Live #Updates” అంటూ మార్చి 27, 2020న వీడియోను అప్లోడ్ చేశారు.
అదనంగా.. మార్చి 26, 2020 నాడు Xలో ANI చేసిన పోస్ట్ ను గమనించాం. “బెళగాంలో #Coronaviruslockdownని ఉల్లంఘించినందుకు పోలీసులు ప్రజలను కొట్టారు. ప్రజలు ప్రార్థనలు ముగించుకుని వెళ్లిపోతుండగా మసీదు వెలుపల ఈ ఘటన జరిగింది." అంటూ పోస్టులో తెలిపారు.
అందుకే, నాగపంచమి వేడుకల్లో భాగంగా నాగరబెట్ట పూజ సందర్భంగా ముస్లింలను పోలీసులు కొట్టారన్న వాదన అవాస్తవం. ఈ వీడియో 2020 నాటిది. కోవిడ్-19 లాక్‌డౌన్ ఆంక్షలను పోలీసులు అమలు చేస్తున్న వీడియో ఇది. ఈ ఘటనలో మతపరమైన కోణం లేదు.
Credit : Sibahathulla Sakib