ఒక సన్యాసి నవ్వుతూ ఉన్న చిత్రం సోషల్ మీడియాలో విస్తృతంగా షేర్ చేయబడుతోంది. అతను టిబెటన్ సన్యాసి అని.. అత్యధిక కాలం జీవించి ఉన్న మనిషి అని వినియోగదారులు పేర్కొన్నారు.
"నేపాల్ పర్వతాలలో ఒక టిబెటన్ సన్యాసి కనుగొనబడ్డాడు. ప్రపంచంలోనే అత్యధిక కాలం జీవించి ఉన్న వ్యక్తి అని చెబుతున్నారు. అతని వయస్సు 201. ఇన్నేళ్ళుగా ధ్యాన స్థితిలో ఉన్నాడు, దీనిని 'తకాటే' అని పిలుస్తారు. మొదట పర్వత గుహలో కనుగొనబడిన సమయంలో అతన్ని మమ్మీగా భావించారు" అని క్యాప్షన్ ఉంది. ఆ తర్వాత అతడికి ఊపిరి ఆడుతోందని తెలుసుకుని అందరూ షాక్ అయ్యారని తెలిపారు.
నిజ నిర్దారణ :
NewsMeter గూగుల్ రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేసింది. జనవరి 24, 2018న ఎక్స్‌ప్రెస్ అనే మీడియా సంస్థకు సంబంధించిన కథనాన్ని మాకు చూపించింది. ఇది వైరల్ పోస్ట్‌కు సంబంధించిన ఫోటోను కలిగి ఉంది.
'నిర్వాణ రీచ్డ్' పేరుతో నివేదికను రూపొందించారు. రెండు నెలలుగా కుళ్ళిపోని ఆ చనిపోయిన సన్యాసికి ఇప్పటికీ 'మొహంలో చిరునవ్వు' ఉంది. నివేదిక ప్రకారం, నవంబర్ 16, 2017న 92 సంవత్సరాల వయస్సులో సన్యాసి లుయాంగ్ ఫోర్ పియాన్ మరణించారు. ఆయన మృతదేహాన్ని సెంట్రల్ థాయ్ ప్రావిన్స్ లోప్‌బురిలోని ఆలయంలో ఉంచారు. ఆయన అనుచరులు ఆయన మరణించిన వారానికి మృతదేహాన్ని బయటకు తీసివేసారు. ఆయన శరీరం కుళ్ళిపోలేదని తెలుసుకుని వారు ఆశ్చర్యపోయారు. అలాగే ఆ సన్యాసి నవ్వుతున్నట్లు కనిపించారు."
జనవరి 22, 2018న డైలీ మెయిల్ ప్రచురించిన నివేదికలో కూడా ఇదే చిత్రం కూడా ప్రచురించబడింది. "పియాన్ అనుచరులు శవపేటిక నుండి ఆయన మృతదేహాన్ని తీసివేసినప్పుడు పియాన్ శవం నవ్వుతూ కనిపించింది, అనుచరులు నమ్మశక్యం కాని క్షణం యొక్క చిత్రాలను తీసి సోషల్ మీడియాలో పంచుకున్నారు" అని నివేదికలో ఉంది. ఆయన వయసు 92 సంవత్సరాలేనని.. 210 సంవత్సరాలు కాదని మనకు స్పష్టంగా తెలుస్తోంది.
Modernghana, IB Times, Metro వంటి వెబ్ సైట్స్ లో కూడా వైరల్ ఫోటోకు సంబంధించిన వార్తలను కనుగొన్నాము.
201 సంవత్సరాల వయసున్న సన్యాసి హిమాలయాల్లో కనిపించాడని చెబుతున్న వార్తల్లో ఎటువంటి నిజం లేదు. అందువల్ల వైరల్ పోస్టులు తప్పు అని స్పష్టమైంది. సన్యాసి 2017లో బ్యాంకాక్‌లో కన్నుమూశారు. అది కూడా 92 సంవత్సరాల వయసులో..!