చికెన్‌ బిర్యానీ కంటే.. వాటిలోనే కొవ్వెక్కువ..

By అంజి  Published on  10 March 2020 5:31 AM GMT
చికెన్‌ బిర్యానీ కంటే.. వాటిలోనే కొవ్వెక్కువ..

హైదరాబాద్‌: దేశంలోని మెట్రో నగరాల్లో మహిళల కంటే పురుషులే అధికంగా కొవ్వు పదార్థాలను వినియోగిస్తున్నారని ఐసీఎమ్‌ఆర్‌ సర్వేలో తేలింది. ఏడు మెట్రో నగరాల్లో ఐసీఎమ్‌ఆర్‌ ఈ సర్వే చేసింది. పురుషులు అధికంగా 34.1 గ్రాములను కొవ్వు పదార్థాలను తీసుకుంటుండగా.. మహిళలు 31.1 గ్రాముల కొవ్వును వినియోగిస్తున్నారు. మాంసాహారంలో కంటే శాకాహారంలోనే కొవ్వు అధికంగా ఉందని ఈ సర్వే నిర్వహకులు తెలిపారు. పప్పు, అన్నం, పరోటా, చుడువా వంటి కొవ్వు అధికంగా ఉంటోంది. ఉడికించిన, మామూలుగా వేయించిన ఆహారం తినేవారిలో కొవ్వు శాతం తక్కువగా ఉందని పేర్కొంది. అదే బాగా వేయించిన ఆహారంలో కొవ్వు శాతం అధికంగా ఉందని ఈ అధ్యయనంలో తెలిసింది.

చికెన్‌ బిర్యానీలో తక్కువ కొవ్వు ఉంటుందని, మటన్‌ బిర్యానీలో ఎక్కువగా కొవ్వు ఉంటుందని ఈ సర్వే తెలిపింది. అయితే అదనపు కొవ్వు ఉపయోగించే వారిలో ఎక్కువగా 36 ఏళ్ల నుంచి 59 ఏళ్ల వయసు వారే ఉన్నారు. ఇక వీరు రోజుకు సగటున 36.1 గ్రాముల కొవ్వు పదార్థాలను తీసుకుంటున్నారు. 18 నుంచి 35 ఏళ్ల లోపు వారు 32.8 గ్రాముల కొవ్వును ఉపయోగిస్తున్నారు.

Also Read: డ్రైఫ్రూట్స్ తో అధిక బరువును తగ్గించుకోండిలా..

ఇక రోజువారీ స్నాక్స్‌, పరోటా, మటన్‌ బిర్యాణీ రూపంలో కొవ్వును ఢిల్లీలో అధికంగా వినియోగిస్తున్నారు. అహ్మదాబాద్‌, బెంగళూరు, ముంబై, కోల్‌కతా, ఢిల్లీ, చెన్నై, హైదరాబాద్‌ మెట్రో నగరాల్లో ఇండియన్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ మెడికల్‌ రీసెర్చ్‌ సర్వే నిర్వహించింది. ఢిల్లీలో కొవ్వు పదార్థాల వినియోగం రోజు రోజుకూ పెరుగుతోంది. అక్కడ రోజుకు సగటున 44.4 గ్రాములను కొవ్వు పదార్థాలను తింటున్నారు. ఇక రెండో స్థానంలో 43.9 గ్రాములతో అహ్మదాబాద్‌ నిలిచింది. ఇక కోల్‌కతా 37.3 గ్రాముల కొవ్వు పదర్థాలను వినియోగిస్తున్నారు. చివరి స్థానాల్లో ముంబై, హైదరాబాద్‌లు 28.4, 25.1 గ్రాముల కొవ్వు వినియోగంతో ఉన్నాయి. మనం నిత్యం తీసుకోవాల్సిన 20 గ్రాముల కొవ్వు పదార్థాల కంటే అధికంగా తీసుకుంటున్నట్లు ఐసీఎమ్‌ఆర్‌ తెలిపింది.

Next Story