అమెరికాలో షెల్ కంపెనీలతో కోట్లకు గాలం.. టెకీ అరెస్టు

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  25 July 2020 9:22 PM IST
అమెరికాలో షెల్ కంపెనీలతో కోట్లకు గాలం.. టెకీ అరెస్టు

నాలుగేళ్ల క్రితం ఎంతో మంది ప్ర‌ముఖుల గుట్టుర‌ట్టు చేసిన పనామా పేపర్స్ ప్ర‌పంచ‌వ్యాప్తంగా పెను దుమారాన్ని రేపిన సంగ‌తి తెలిసిందే. కేవ‌లం కాగితాల‌కే ప‌రిమిత‌మైన షెల్ (డొల్ల) కంపెనీల బాగోతాన్ని ఇంటర్నేషనల్ కన్సార్టియం ఆఫ్ ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్ట్స్ (ఐసీఐజే) బ‌య‌ట‌పెట్టిన సంగ‌తి తెలిసిందే. ఆ పేప‌ర్ల పుణ్య‌మా అంటూ పాకిస్థాన్ మాజీ ప్ర‌ధాని న‌వాజ్ ష‌రీఫ్ ప‌ద‌వీచ్యుతుడ‌య్యారు. అయినప్పటికీ, ఈ షెల్ కంపెనీల మాటున కోట్లు కొల్లగొట్టాలనుకునే వారి దురాశకు అడ్డుకట్టపడడం లేదు.

ఇలా, ప్రభుత్వానికి పన్ను ఎగ్గొట్టేందుకో.. ప్రభుత్వం నుంచి రాయితీలు రాబట్టేందుకు అడ్డదిడ్డంగా పుట్టగొడుగుల్లాంటి షెల్ కంపెనీలను సృష్టిస్తూ దర్జాగా తిరుగుతున్నారు కొందరు ప్రబుద్ధులు. తాజాగా, పనామా పేపర్ల తరహాలోనే షెల్ కంపెనీలతో అమెరికా సర్కార్ కు టోకరా వేయాలని చూశాడో కేటుగాడు. కరోనా విపత్తుతో చితికిపోయిన చిన్న తరహా కంపెనీల కోసం అందిస్తోన్న ఉద్దీపన ప్యాకేజీ పొందేందుకు అడ్డదారులు తొక్కి...లేని కంపెనీలకు ఓ టెకీ యజమాని అయ్యాడు. చివరకు ఈ వైట్ కాలర్ నేరగాడి గుట్టు రట్టవడంతో అతడిని సియాటెల్ పోలీసులు అరెస్టు చేసి కేసు నమోదు చేశారు.

ముకుంద్‌ మోహన్‌ అనే వ్యక్తి గతంలో అమెజాన్‌, మైక్రోసాఫ్ట్‌ లలో ఎగ్జిక్యూటివ్‌గా పనిచేశాడు. బిల్డ్‌డైరెక్ట్‌.కామ్‌ టెక్నాలజీస్‌కు చీఫ్‌ టెక్నాలజీ ఆఫీసర్‌గా పని చేస్తోన్న ముకుంద్ కు రాబిన్‌హుడ్‌ అనే బ్రోకరేజ్‌ సంస్థ కూడా ఉంది. అయితే, కరోనా వల్ల దెబ్బతిన్న చిన్నతరహా సంస్థలను గట్టెక్కించేందుకు ఉద్దేశిచిన ‘పేచెక్‌ ప్రొటెక్షన్‌ ప్రోగ్రాం’ నుంచి డబ్బులు దండుకోవాలని ముకుంద్ ప్లాన్ వేశాడు. అందుకోసం ఏకంగా 6 షెల్‌ కంపెనీలను క్రియేట్ చేసి 8 రకాల లోన్లకు దరఖాస్తు చేశాడు. ఆ బోగస్ కంపెనీల్లో లేని ఉద్యోగులకు 2.3 మిలియన్‌ డాలర్లను జీతాలుగా చెల్లించానని బుకాయించాడు.

అయితే, ఈ ఏడాది మేలోనే ఒక కంపెనీకి సంబంధించిన యాజమాన్య హక్కులు ముకుంద్ కు సంక్రమించాయని అధికారులు తనిఖీల్లో గుర్తించారు. అసలు ఆ కంపెనీలో ఒక్క ఉద్యోగి కూడా లేదని తెలియడంతో పోలీసులు అవాక్కయ్యారు. వెంటనే ముకుంద్ ను అరెస్టు చేసి కేసు నమోదు చేశారు.

Next Story