తెలంగాణలో కరోనా డేంజర్ బెల్స్.. నిమిషానికో కేసు
By తోట వంశీ కుమార్ Published on 27 July 2020 7:28 AM GMTతెలంగాణ రాష్ట్రంలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. శరవేగంగా కేసులు పెరుగుతున్నాయి. రాష్ట్రంలో గంటకు 62 మంది కరోనా మహమ్మారి బారీన పడుతున్నట్లు గణాంకాలు చెబుతున్నారు. జూలై 1వ తేదీ నుంచి 25 వరకు ఏకంగా 37,720 కేసులు వెలుగు చూశాయి. గత కొన్ని రోజులుగా జీహెచ్‌ఎంసీ పరిధిలో కేసులు తగ్గుతున్నట్లు కనిపిస్తున్నా.. జిల్లాల్లో కేసులు పెరుగుతుండడం ఆందోళన కలిగిస్తోంది.
వరంగల్‌లో సగటున రోజుకు 100కేసులు నమోదుఅవుతుండగా.. కరీంనగర్, నల్గొండ, నిజామాబాద్ వంటి రెండో స్థాయి పట్టణాల్లోనూ వైరస్ విజృంభిస్తోంది. స్వీయ నియంత్రణ ద్వారానే వైరస్ వ్యాప్తిని అరికట్టడం సాధ్యం అవుతుందని నిపుణులు సూచిస్తున్నా.. ఇప్పటికి చాలా మంది నిబంధనలను పాటించకపోవడం అధికారులను కలవరపెడుతోంది. గుంపులుగా ఒకే చోట చేరడం, మాస్కులు ధరించకపోవడం, చేతులు శుభ్రం చేసుకోకపోవడం వల్ల వైరస్ ఎక్కువగా వ్యాప్తి చెందుతోందని అధికారులు చెబుతున్నారు. కేసులు పెరుగుతున్న నేపథ్యంలో జిల్లాల్లో పర్యటించి సమస్యల పారిష్కారానికి కృషి చేయాలని సీఎం కేసీఆర్ ఆదేశాలు జారీ చేయగా.. కొవిడ్ చికిత్సలను సమీక్షించేందుకు వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ జిల్లాల్లో పర్యటిస్తున్నారు.
రానున్న రోజుల్లో పల్లెల్లోనూ వైరస్ వ్యాప్తి అధికంగా ఉండే అవకాశాలు ఉన్నాయని ఆరోగ్యశాక అంచనాకు వచ్చింది. గతవారం వైద్యమంత్రి జిల్లా వైద్యాధికారులు, జిల్లా, ప్రాంతీయ ఆస్పత్రుల సూపరింటెండెంట్లతో సమీక్షించారు. బాధితులకు స్థానికంగానే వైద్య సేవలు అందించాలని ఆదేశాలిచ్చింది. ఈ నెల 25న 1,593 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా.. మొత్తంగా 54,059కి చేరింది. 41,332 మంది కరోనా నుంచి కోలుకోగా.. 463 మంది కరోనా కారణంగా ప్రాణాలు కోల్పోయారు. ఇంకా 12,264 మంది వివిధ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. ఇప్పటి వరకు రాష్ట్రంలో 3,53,425 మందికి కొవిడ్ పరీక్షలు నిర్వహించారు.