లెక్కలు ఓకే.. కేసులు తగ్గవేం.?
By న్యూస్‌మీటర్ తెలుగు Published on 29 Jun 2020 8:06 AM GMTదాదాపు నాలుగు నెలల క్రితం మహమ్మారి కేసు ఒకటి వెలుగు చూసినంతనే.. వామ్మో అంటూ హైదరాబాద్ మహానగరం ఒక్కసారి హైరానా పడిపోయింది. చూస్తున్నంతనే క్యాలెండర్ లో నెలలు మారిపోయాయి. ఏడాది మధ్యకు వచ్చేశాం. మరో రోజులో జులైలోకి అడుగు పెట్టేయనున్నాం. ఒక్క కేసుకు హైరానా పడిన స్థానే.. ఇప్పుడు రోజుకు 800ప్లస్ కేసులు నమోదవుతున్న దుస్థితి.
ఎక్కడో మనకు తెలీని ప్రాంతంలో పాజిటివ్ కేసులు నమోదైన పరిస్థితి నుంచి.. మన వీధి వరకూ మహమ్మారి వచ్చేసింది. ఇప్పటికే పలువురి ఇళ్లలోకి వచ్చిన ఈ మాయదారిరోగంతో మహానగరం ఆగమాగం అవుతున్న పరిస్థితి. ఇలాంటివేళలోనూ రాష్ట్ర మంత్రి ఈటెల వారి మాటల్ని చూస్తే.. ఆశ్చర్యంతో అవాక్కు అవ్వాల్సిందే.
మహమ్మారి గురించి పెద్దగా భయపడాల్సిన అవసరం లేదని.. వైరస్ మరణాల్లో జాతీయ సగటుతో పోలిస్తే తెలంగాణలో మరణాల రేటు తక్కువగా ఉందని చెబుతున్నారు ఈటెల. అదే సమయంలో.. గతంలో దేశ వ్యాప్తంగా నమోదైన పాజిటివ్ కేసుల జాబితాలో అక్కడెక్కడో అడుగున ఉండే తెలంగాణ.. ఈ రోజు నాలుగో స్థానానికి వచ్చిన వైనాన్ని మాత్రం ఈటెల నోటి నుంచి రాదు.
మహమ్మారి కారణంగా చోటు చేసుకుంటున్న మరణాలు జాతీయ సగటు 3.04 శాతం ఉంటే.. రాష్ట్రంలో మాత్రం అది కేవలం 1.52 శాతం మాత్రమేనని చెప్పటం చూస్తే.. ఈటెల నోట అంకెల గారడీ అన్నట్లుగా అనిపించక మానదు. ఇదంతా చూసినప్పుడు అనిపించేది ఒక్కటే.. మస్తు మాటలు తర్వాత.. ముందు హైదరాబాద్ మహానగరంలో పాజిటివ్ కేసులు తగ్గించి చూపించొచ్చుగా? అన్న సందేహం రాక మానదు. గణాంకాలతో వచ్చే ఇబ్బందేమంటే.. మనకు అనుకూలంగా ఉండే వాటిని మాత్రమే ప్రస్తావించి.. మిగిలిన వాటిని వదిలేయొచ్చు. ఈటెల మాటలు ఇందుకు మినహాయింపేమీ కాదు.