దేవికా రాణి బినామీల దగ్గర కోట్లలో డబ్బు.. పట్టుకున్న ఏసీబీ

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  1 Sept 2020 6:00 PM IST
దేవికా రాణి బినామీల దగ్గర కోట్లలో డబ్బు.. పట్టుకున్న ఏసీబీ

తెలుగు రాష్టాల్లో సంచ‌ల‌నం సృష్టించిన‌ ఈఎస్ఐ కుంభ‌కోణం కేసులో దేవికారాణి బినామీల దగ్గర కోట్లలో డబ్బు ఉండడాన్ని అవినీతి నిరోధ‌క శాఖ అధికారులు గుర్తించారు. రూ. 4.4 కోట్ల విలువైన ఆస్తుల‌ను ఏసీబీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో ప్ర‌ధాన నిందితులైన ఐఎంఎస్ డైరెక్ట‌ర్ దేవికారాణి, ఫార్మాసిస్ట్ నాగ‌ల‌క్ష్మికి చెందిన రూ. 4.4 కోట్ల ఆస్తుల‌ను సీజ్ చేశారు. ఆదాయానికి మించి ఆస్తులు క‌లిగి ఉన్న‌ట్లు గుర్తించారు. నిందితులిద్ద‌రూ స్థిరాస్తి రంగంలో పెట్టుబ‌డులు పెట్టిన‌ట్లు అధికారులు గుర్తించారు.

మాజీ ఈఎస్ఐ డైరెక్టర్ దేవికారాణి, డాక్టర్ నాగమణిలు నివాస స్థలం కోసం రూ. 4.4 కోట్లను ఇచ్చినట్టుగా ఏసీబీ అధికారులు గుర్తించారు. అక్రమాస్తులు బిల్డర్ వద్దే ఉన్నాయని ఏసీబీ అధికారులు అభిప్రాయపడుతున్నారు. బిల్డర్ ను అదుపులోకి తీసుకొని ఏసీబీ అధికారులు విచారణ చేస్తున్నారు. ఆంధ్రప్రదేష్ లోనూ ఈఎస్ఐ స్కాం చోటు చేసుకొంది.ఈ స్కాంలో అచ్చెన్నాయుడు సహా పలువురిని ఏసీబీ అధికారులు అరెస్ట్ చేశారు.

ఐఎంఎస్‌లో దేవికారాణి తన మనుషులతో ఒక వ్యవస్థను ఏర్పాటు చేశారు. రేటు కాంట్రాక్ట్‌ (ఆర్‌సీ) ప్రకారం లక్షల విలువైన పర్చేజ్‌ ఆర్డర్‌కు నాన్‌ రేట్‌ కాంట్రాక్ట్‌ (ఎన్‌ఆర్‌సీ)లో కోట్లు చెల్లించారు. డొల్ల సంస్థల్లోనే కొనాల్సిన మందుల్ని గుర్తించేలా పర్చేజ్‌ ఆర్డర్‌లో లావుపాటి అక్షరాలతో ముద్రించేవారు.

దేవికారాణి ఫార్మాసిస్ట్‌ నాగలక్ష్మితో కలిసి రెండు డొల్ల కంపెనీలు ఏర్పాటు చేశారు. నాగలక్ష్మి బంధువైన ఎం.మురళీకృష్ణ పేరుతో మహీధర మెడికల్‌ అండ్‌ సర్జికల్‌ కంపెనీ, అతని భార్య విజయలక్ష్మి పేరుతో జై సాయిరాం డిస్ట్రిబ్యూటర్స్‌ ఏర్పాటు చేశారు. ఈ రెండింటినీ తేజా ఫార్మా కంపెనీ ఎండీ రాజేశ్వర్‌రెడ్డి 2016లో రిజిస్టర్‌ చేయించారు. ఆర్‌సీలో ఉన్న మందుల్ని లోకల్‌ పర్చేజ్‌లో నిబంధనలకు విరుద్ధంగా డైరెక్టర్‌, అసిస్టెంట్‌ డైరెక్టర్‌, ఫార్మాసిస్ట్‌ కలిసి డొల్ల కంపెనీలతో కలిసి ప్రభుత్వ సొమ్మును కాజేశారు.

అక్రమంగా సంపాదించిన కోట్ల రూపాయలతో దేవికారాణి విలువైన ఆభరణాలు కొన్నారని, విలాసవంతమైన జీవితం గడుపుతున్నారని ఏసీబీ తన దర్యాప్తులో గుర్తించింది. మెడికల్‌ ఏజెన్సీల నుంచి వచ్చిన డబ్బుతో దేవికా రాణి పెద్ద మొత్తంలో ఆభరణాలు కొనుగోలు చేసినట్టుగా ఏసీబీ తెలిపింది. దేవికారాణి అక్రమార్జనలు.. హవాలా వ్యాపారానికి ఏ మాత్రం తీసిపోదు. డబ్బును ఎవరి వద్ద తీసుకోవాలనే విషయాన్ని దేవికారాణి ఆభరణాల షోరూమ్‌ యాజమానికి మెసేజ్‌ ద్వారా తెలియజేసేదని అధికారులు గుర్తించారు. జ్యుయలరీ షాపు యాజమాని బంగారం ఆభరణాలను డెలివరీ బాయ్‌కి ఇచ్చి పంపించి డబ్బులు తీసుకునేవవాడని.. అయితే ఎప్పటికప్పుడు దేవికారాణి, షాపు యాజమాని సెల్‌ఫోన్‌లో చాట్‌ చేసిన మెసేజ్‌లను డిలీట్‌ చేశారు.

అలాగే వీరు లెజెండ్‌ పేరుతో షెల్‌ కంపెనీ ఏర్పాటు చేసి తెల్ల రక్తకణాలు కిట్స్‌, గ్లూకోజ్‌ క్యూయేట్‌ కొనుగోళ్లలో భారీ అక్రమాలు జరిపినట్టు తెలుస్తోంది.

Next Story