టాలీవుడ్‌లో మరో విషాదం చోటు చేసుకుంది. రెండు రోజుల క్రితం సీనియర్ నటుడు కైకాల సత్యనారాయణ మరణించిన సంగతి తెలిసిందే. ఆయన ఇక లేరు అనే వార్త జీర్ణించుకోక ముందే మరో నటుడు కన్నుమూశారు. ప్రముఖ నటుడు చలపతిరావు హఠాన్మరణం చెందారు. హైదరాబాద్‌లోని ఆయన నివాసంలో నేటి(ఆదివారం) తెల్లవారుజామున గుండెపోటుతో మరణించారు. ఆయన వయస్సు 78 సంవత్సరాలు. దీంతో చిత్ర పరిశ్రమలో తీవ్ర విషాదం నెలకొంది. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలంటూ పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా సంతాపం వ్యక్తం చేస్తున్నారు. చలపతిరావుకు ఇద్దరు కూతుర్లు, కుమారుడు రవిబాబు ఉన్నారు.
కృష్ణా జిల్లా బల్లిపర్రులో 1944 మే 8న చలపతిరావు జన్మించారు. 'గూఢచారి 116' చిత్రంతో తెరగ్రేటం చేశారు. విలన్‌గా, సహాయ నటుడిగా, కమెడియన్ సుమారు పన్నెండు వందల చిత్రాల్లో ఆయన నటించారు. ఎన్టీఆర్, కృష్ణ, నాగార్జున, ,చిరంజీవి, వెంకటేష్ చిత్రాల్లో నటించి మంచి పేరు తెచ్చుకున్నారు. 'కలియుగ కృష్ణుడు', 'కడప రెడ్డమ్మ', 'జగన్నాటకం', 'పెళ్లంటే నూరేళ్ల పంట', 'రాష్ట్రపతి గారి అల్లుడు' వంటి చిత్రాలను నిర్మించారు. ఆయన కుమారుడు రవిబాబు విలక్షణమైన నటుడిగా, దర్శకునిగా గుర్తింపు పొందారు. పరిశ్రమలో అందరూ చలపతిరావుని బాబాయ్ అని పిలుస్తూ ఉంటారు. గత కొంత కాలంగా ఆయన సినిమాలకు దూరంగా ఉన్నారు.