కరోనా వేవ్ తగ్గుముఖం పట్టడంతో థియేటర్లు తెరిచేందుకు ఎగ్జిబిటర్లు సిద్ధమైనా.. ఏపీలో టిక్కెట్టు ధర సమస్యాత్మకం అయిన సంగతి తెలిసిందే. సవరించిన ధరలతో ఎగ్జిబిషన్, పంపిణీ రంగాలు చిక్కుల్లో పడ్డాయి. థియేటర్ల సమస్య చాలాకాలంగా ఓ కొలిక్కి రాలేదు. సీఎం జగన్ తో భేటీ కోసం సినీపెద్దలు ప్రయత్నిస్తున్నారని కథనాలొచ్చాయి. ఏపీ మంత్రి పేర్ని నాని.. మెగాస్టార్ చిరంజీవికి శనివారం రోజు ఫోన్ చేసి, సినీపెద్దలతో కలిసి వచ్చి ప్రస్తుత సమస్య సీఎంకు వివరించాల్సిందిగా చిరంజీవిని ఆహ్వానించారని వార్తలు వెలువడ్డాయి.
ఈ భేటీలో ప్రస్తుతం ఉన్న థియేటర్ల సమస్య గురించి.. ఈ రంగంపై ఆధారపడి జీవిస్తున్న కార్మికుల బతుకు తెరువు సహా.. పంపిణీ వర్గాల వేతనాల గురించి మాట్లాడే అవకాశం ఉందని తెలుస్తోంది. చిరంజీవితో పాటు సినీ పరిశ్రమకు చెందిన కొందరు సినీ పెద్దలు హాజరు కానున్నట్లు సమాచారం. ఇంతకుముందు సీఎంతో భేటీలో చిరంజీవి- నాగార్జున - రాజమౌళి- సురేష్ బాబు బృందం సమస్యలు విన్నవించగా.. ఏపీ సీఎం జగన్ సానుకూలంగా స్పందించిన విషయం తెలిసిందే. అన్ని కుదిరితే.. భేటీ ఈ నెల చివరి వారంలో జరగనుంది. సీఎం జగన్ ఈసారి సమస్యకు తక్షణ పరిష్కారం చూపిస్తారనే అంతా ఆకాంక్షిస్తున్నారు.