సినీ పరిశ్రమలో విషాదం.. సీనియర్ నటుడు కన్నుమూత
Tollywood Actor Vidyasagar Passed Away. తెలుగు చలన చిత్ర పరిశ్రమలో మరో విషాదం చోటు చేసుకుంది.
By Medi Samrat Published on 28 Aug 2022 7:45 PM ISTతెలుగు చలన చిత్ర పరిశ్రమలో మరో విషాదం చోటు చేసుకుంది. సీనియర్ నటులు విద్యాసాగర్ రాజు కన్నుమూశారు. ఆయన వయసు 73 సంవత్సరాలు. విద్యాసాగర్ రాజు కొన్నాళ్ల కిందట పక్షవాతానికి గురయ్యారు. ఈరోజు ఉదయం ఆయన ఆరోగ్య పరిస్థితి విషమించడంతో తుదిశ్వాస విడిచారు. ఈ విషయాన్ని కుటుంబ సభ్యులు మీడియాకు తెలిపారు. ఆయన హీరోగా కూడా కొన్ని సినిమాలు చేశారు. ఆ తర్వాత విలన్, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కూడా రాణించారు. మాయలోడు, రాజేంద్రుడు-గజేంద్రుడు, అహ నా పెళ్లంట, స్వాతిముత్యం, ఆఖరి క్షణం వంటి హిట్ చిత్రాల్లో నటించి గుర్తింపు తెచ్చుకున్నారు. విద్యాసాగర్ రాజు తన కెరీర్ లో 100కి పైగా చిత్రాల్లో నటించారు. బామ్మ పాత్రల్లో నటించి మెప్పించిన రత్నా సాగర్ భర్త విద్యా సాగర్ అని చాలా తక్కువమందికి తెలుసు. నాటక రంగం నుంచి వెండితెరపై అడుగుపెట్టిన విద్యా సాగర్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా, విలన్ గా, కమెడియన్ గా నటించి మెప్పించారు.
విద్యాసాగర్ రాజు తొలుత నాటకాలతో మెప్పించారు. ఆపై సినీ రంగంలో ప్రవేశించి అన్ని తరహా పాత్రలు పోషించారు. 'ఈ చదువులు మాకొద్దు' అనే అభ్యుదయ చిత్రంలో ముఖ్యపాత్ర పోషించారు. ఆయన పక్షవాతం బారిన పడ్డారు. ఒక కాలు, ఒక చేయి పడిపోవడంతో వీల్ చైర్ కే అంకితమయ్యారు. అయినా కూడా పలు సినిమాల్లో, సీరియల్స్ లో నటిస్తూ వచ్చారు. విద్యాసాగర్ కు ఇద్దరు ఆడపిల్లలు. పలువురు సినీ ప్రముఖులు ఆయన మృతిపట్ల సంతాపం వ్యక్తం చేశారు. విద్యాసాగర్ అంత్యక్రియలు సోమవారం మన్సిలాల్ పేట స్మశానంలో జరగనున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.