విషాదంలో చిత్ర‌సీమ‌.. నటుడు మోహన్ రాజ్ క‌న్నుమూత‌

ప్రముఖ నటుడు మోహన్ రాజ్ అక్టోబర్ 3న మరణించారు.

By Medi Samrat  Published on  4 Oct 2024 2:30 AM GMT
విషాదంలో చిత్ర‌సీమ‌.. నటుడు మోహన్ రాజ్ క‌న్నుమూత‌

ప్రముఖ నటుడు మోహన్ రాజ్ అక్టోబర్ 3న మరణించారు. రంగస్థలం నుంచి పెద్ద‌తెర‌పై న‌టుడిగా స్థిర‌ప‌డిన ఆయన 70 ఏట క‌న్నుమూశారు. మోహన్ రాజ్ మృతితో సౌత్ ఇండియన్ సినిమా విషాదంలో మునిగింది. ఆయ‌న‌ మలయాళం, తమిళం, తెలుగు చిత్రాలలో మంచి పాత్ర‌ల‌తో పేరు తెచ్చుకున్నారు. ఆయన అంత్యక్రియలు శుక్రవారం కేరళలో నిర్వహించనున్నారు. ఆయ‌న‌ చాలా కాలంగా పార్కిన్సన్స్ వ్యాధితోపాటు మధుమేహంతో బాధపడుతున్నారు. కొద్దికాలంగా ఆయ‌న తిరువనంతపురంలో ఆయుర్వేద చికిత్స పొందుతున్నారు. కానీ ప‌రిస్థితి విష‌మించ‌డంతో ఆయ‌న క‌న్నుమూశారు.

మూడు దశాబ్దాల సుదీర్ఘ కెరీర్‌లో మోహన్ రాజ్ 300కు పైగా చిత్రాలలో న‌టించారు. మోహ‌న్ రాజ్‌కు విలన్ పాత్రతో ప్రత్యేక గుర్తింపు వ‌చ్చింది. ఉప్పుకందం బ్రదర్స్, చైంకోల్, ఆరం తంపురాన్, నరసింహం చిత్రాల్లో ఆయన చేసిన పాత్రలు ఇప్పటికీ గుర్తుండిపోతాయి. మోహన్ రాజ్ కు గంభీర‌మైన‌ స్వరం ప్ల‌స్ పాయింట్‌గా చెబుతారు. త‌న హ‌వ‌భావాల‌తో దక్షిణాది చిత్రాలలో ఎన్నో విలన్ పాత్రల‌ను పోషించారు.

మోహన్ రాజ్ మృతి వార్తను నటుడు, దర్శకుడు దినేష్ పణికర్ సోషల్ మీడియాలో షేర్ చేసి సంతాపం వ్యక్తం చేశారు. గురువారం మధ్యాహ్నం 3 గంటల ప్రాంతంలో మోహన్ రాజ్ తన స్వగృహంలో మరణించారని.. మరుసటి రోజు తిరువనంతపురంలో అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు ఆయన తెలిపారు. ఈ ప్రకటన తర్వాత తోటి నటీనటులు, చిత్ర నిర్మాతలు, అభిమానుల నుంచి సంతాపం వెల్లువెత్తింది. సినిమా రంగానికి ఆయన చేసిన కృషిని అందరూ గుర్తు చేసుకున్నారు.

Next Story