సిరివెన్నెల మృతిపై తెలుగు రాష్ట్రాల సీఎంల సంతాపం

Telugu States CM's Condolences Sirivennela Sitarama Sastry Death. ప్రముఖ సినీ గేయ రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి కన్నుమూశారు.

By Medi Samrat  Published on  30 Nov 2021 1:05 PM GMT
సిరివెన్నెల మృతిపై తెలుగు రాష్ట్రాల సీఎంల సంతాపం

ప్రముఖ సినీ గేయ రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి కన్నుమూశారు. గతకొన్ని రోజులుగా అనారోగ్యంతో సికింద్రాబాద్‌లోని కిమ్స్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆయన మంగళవారం సాయంత్రం 4:07 గంటలకు తుదిశ్వాస విడిచారు. దీంతో చిత్ర‌సీమలో తీవ్ర‌విషాదం నెల‌కొంది. ఆయ‌న మృతిప‌ట్ల సినీ, రాజ‌కీయ ప్ర‌ముఖులు సంతాపం ప్ర‌క‌టిస్తున్నారు.

పద్మశ్రీ సిరివెన్నెల మరణం పట్ల తెలంగాణ సీఎం కేసీఆర్‌ సంతాపం వ్యక్తం చేశారు. ఎటువంటి సంగీత ప్రక్రియలతోనైనా పెనవేసుకుపోయే అద్భుత సాహిత్యాన్ని సృష్టించిన సిరివెన్నెల, పండిత పామరుల హృదయాలను గెలిచారని సీఎం కేసీఆర్‌ తెలిపారు. సినిమా పేరునే తన ఇంటిపేరుగా మార్చుకున్న ఆయన సాహిత్య ప్రస్థానం, సామాజిక, సాంప్రదాయ అంశాలను స్పృశిస్తూ మూడున్నర దశాబ్దాల పాటు సాగిందని గుర్తు చేసుకున్నారు. సిరివెన్నెల సీతారామ శాస్త్రి మరణం, తెలుగు చలనచిత్ర రంగానికి, సంగీత సాహిత్య అభిమానులకు తీరని లోటన్నారు. వారి కుటుంబ సభ్యులకు సీఎం కేసీఆర్‌ తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు.

సిరివెన్నెల సీతారామశాస్త్రి మృతిపై ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ సీఎం వైఎస్‌ జగన్‌ సంతాపం తెలిపారు. తెలుగు సినీ గేయ ప్రపంచంలో సిరివెన్నెల విలువల శిఖరం అన్నారు. ఆయన మరణం తెలుగువారికి తీరని లోటన్నారు. అక్షరాలతో ఆయన చేసిన భావ విన్యాసాలు తెలుగువారి చరిత్రలో ఎప్పటికీ చిరంజీవులు. ఆయన హఠాన్మరణం మొత్తంగా తెలుగువారికి తీరనిలోటు. సిరివెన్నెల సీతారామశాస్త్రిగారి ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటూ, ఆయన కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నానని అన్నారు.


Next Story
Share it