గంటల వ్యవధిలోనే టాలీవుడ్ లో మరో విషాదం

నేటి ఉదయం సీనియర్ నటుడు చంద్రమోహన్ కన్నుమూసిన విషయం తెలిసిందే.

By Medi Samrat  Published on  11 Nov 2023 7:30 PM IST
గంటల వ్యవధిలోనే టాలీవుడ్ లో మరో విషాదం

నేటి ఉదయం సీనియర్ నటుడు చంద్రమోహన్ కన్నుమూసిన విషయం తెలిసిందే. ఆయన తుదిశ్వాస విడిచిన కొన్ని గంటల్లోనే టాలీవుడ్ లో మరో విషాదం చోటు చేసుకుంది. తెలుగు సినీ నిర్మాత, శ్రావ్య ఫిలిమ్స్ వ్యవస్థాపకుడు యక్కలి రవీంద్రబాబు మృతిచెందారు. హైదరాబాద్‌లోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆయన మరణించారు. ఆయన వయసు 55 సంవత్సరాలు. సినీ పరిశ్రమలో ఒకే రోజు రెండు విషాదాలు చోటుచేసుకున్నాయి.

ప్రకాశం జిల్లా మార్కాపురంలో పుట్టిన రవీంద్రబాబు మెకానికల్ ఇంజనీరింగ్ పూర్తి చేసుకొని ఇంజనీర్‌గా పనిచేశారు. ఉద్యోగం చేస్తూనే సినిమాపై ఉన్న ఇష్టంతో నిర్మాతగా మారి దాదాపు 17 చిత్రాలు నిర్మించారు. తెలుగులోనే కాకుండా తమిళం, మలయాళం భాషల్లో కూడా సినిమాలు నిర్మించారు. రవీంద్రబాబు నిర్మాతగా ‘సొంత ఊరు’, ‘గంగపుత్రులు’ వంటి అవార్డు విన్నింగ్ సినిమాలు తీశారు. ‘ఒక రొమాంటిక్ క్రైమ్ కథ’, ‘రొమాంటిక్ క్రిమినల్స్’, ‘గల్ఫ్’, ‘వలస’ లాంటి చిత్రాలు కూడా నిర్మించారు. ఆయన మృతికి పలువురు సంతాపం తెలిపారు.

Next Story