అన్ని సినిమా షూటింగ్‌లు తక్షణమే ఆపేయండి : TFCC

తెలుగు సినీ పరిశ్రమలో కార్మికుల వేతనాల పెంపు వివాదం తీవ్ర స్థాయికి చేరుకుంది. నిర్మాతలు, ఫిలిం ఫెడరేషన్ మధ్య జరిగిన చర్చలు విఫలం అయ్యాయి.

By Medi Samrat
Published on : 8 Aug 2025 5:58 PM IST

అన్ని సినిమా షూటింగ్‌లు తక్షణమే ఆపేయండి : TFCC

తెలుగు సినీ పరిశ్రమలో కార్మికుల వేతనాల పెంపు వివాదం తీవ్ర స్థాయికి చేరుకుంది. నిర్మాతలు, ఫిలిం ఫెడరేషన్ మధ్య జరిగిన చర్చలు విఫలం అయ్యాయి. తదుపరి ఆదేశాలు జారీ చేసే వరకు అన్ని రకాల సినిమా షూటింగ్‌లను తక్షణమే నిలిపివేయాలని తెలుగు ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ నిర్మాతలకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. ఛాంబర్ అనుమతి లేకుండా స్టూడియోలు, అవుట్‌డోర్ యూనిట్లు ఎలాంటి సేవలు అందించవద్దని, నిబంధనలు పాటించకపోతే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించింది. గత కొంతకాలంగా సినీ కార్మికులకు 30 శాతం వేతనాలు పెంచాలని, వాటిని రోజువారీగా చెల్లించాలని ఫిలిం ఫెడరేషన్ యూనియన్లు డిమాండ్ చేస్తున్నాయి. అయితే, ఈ ప్రతిపాదనను నిర్మాతల మండలి అంగీకరించడం లేదు. ప్రస్తుతం ఇస్తున్న వేతనాలు కనీస వేతనాల కన్నా ఎక్కువే ఉన్నాయని, ఫెడరేషన్ ఏకపక్షంగా వ్యవహరిస్తోందని ఫిలిం ఛాంబర్ ఆరోపిస్తోంది. ఈ నేపథ్యంలోనే షూటింగ్‌ల నిలిపివేతకు పిలుపునిచ్చింది.

ఇక ఈ వివాదాన్ని పరిశ్రమ అగ్ర కథానాయకులు చిరంజీవి, బాలకృష్ణ దృష్టికి కూడా తీసుకెళ్లినట్లు సమాచారం. మరో నాలుగు రోజుల్లో చర్చల ద్వారా సమస్యను పరిష్కరించేందుకు ప్రయత్నిస్తామని కో-ఆర్డినేషన్ కమిటీ ఛైర్మన్ వీర శంకర్ తెలిపారు. అప్పటివరకు ఎలాంటి షూటింగ్‌లు జరపవద్దని ఫిలిం ఛాంబర్ స్పష్టం చేసింది.

Next Story