నన్నెవరూ అరెస్ట్ చేయలేదని అంటున్న హీరో మాజీ భార్య
Sussanne Khan says reports on 'arrest' are 'incorrect and irresponsible'. కోవిడ్ నియమాలను ఉల్లంఘించి అర్ధరాత్రి వరకు
By Medi Samrat
కోవిడ్ నియమాలను ఉల్లంఘించి అర్ధరాత్రి వరకు డ్రాగన్ ఫ్లై క్లబ్‌లో పార్టీ చేసుకున్న 34 మందిని సోమవారం రాత్రి ముంబయి పోలీసులు అరెస్ట్ చేసినట్లుగా వార్తలు వచ్చాయి. అరెస్టయిన వారిలో క్రికెటర్ సురేశ్ రైనా, గురు రంధానా వంటి సెలబ్రెటీలు కూడా ఉన్నారు. బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్ మాజీ భార్య సుసానే ఖాన్‌ను కూడా పోలీసులు అరెస్ట్ చేసినట్లు ప్రచారం జరుగుతోంది.
బ్రిటన్‌లో కొత్త రకం కరోనా వైరస్ కలవరపరుస్తున్న నేపథ్యంలో ముంబయి మహానగర పరిధిలో జనవరి 5 వరకు రాత్రి కర్ఫ్యూను విధిస్తూ మహారాష్ట్ర ప్రభుత్వం సోమవారం ఆదేశాలు జారీచేసింది. నైట్ క్లబ్‌లు, పబ్‌లు రాత్రి 11.30 గంటలకల్లా మూసివేయాల్సి ఉన్నా.. డ్రాగన్ ఫ్లై క్లబ్ ను అర్థరాత్రి దాటాక కూడా తెరిచి ఉంచారు. విషయం తెలుసుకున్న పోలీసులు, అధికారులు అక్కడికి చేరుకుని విచారించారు. కోవిడ్ నిబంధనలు ఉల్లంఘించిన కారణంగా 34 మందిని అదుపులోకి తీసుకున్నారు. వీరిలో 27 మంది కస్టమర్లు కాగా.. ఏడుగురు సిబ్బంది ఉన్నారు. ఈ నేపథ్యంలోనే సుసానే ఖాన్‌ను అరెస్ట్ చేసినట్లు ప్రచారం సాగుతోంది.
సుసానే ఖాన్ దీనిపై స్పందించారు. తనను పోలీసులు అరెస్ట్ చేసినట్లు వస్తున్న వార్తల్లో నిజం లేదని సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. క్లోజ్ ఫ్రెండ్ బర్త్‌డే పార్టీలో భాగంగా గత రాత్రి మారియట్‌లోని డ్రాగన్ ఫ్లై క్లబ్‌కి వెళ్లామని ఆమె తెలిపారు. తెల్లవారుజామున 2.30 గంటల సమయంలో కొందరు అధికారులు క్లబ్‌లోకి వచ్చారు. నియమ నిబంధనల గురించి చెక్ చేశారు. యాజమాన్యంతో మాట్లాడి అక్కడున్న అందరినీ మూడు గంటల పాటు వెయిట్ చేయమన్నారు. ఉదయం 6 గంటలకి మమ్మల్ని బయటకు పంపించారు. పోలీసులు నన్ను అరెస్ట్ చేశారంటూ కొందరు ప్రచారం చేశారు. ఆ వార్తలన్నీ పూర్తిగా అవాస్తవమైనవి అని ఆమె తెలిపారు.