కొలంబో వేదికగా జరిగిన సూపర్-8 మ్యాచ్‌లో ఆతిథ్య శ్రీలంకపై 61 పరుగుల తేడాతో న్యూజిలాండ్ ఘనవిజయం సాధించి లంకను టీ20 వరల్డ్ కప్ నుండి నిష్క్రమించేలా చేసింది. సూపర్ 8 గ్రూప్-2 నుంచి ఇంగ్లాండ్ ఇప్పటికే సెమీస్ చేరగా, మిగిలిన ఒక్క స్థానం కోసం న్యూజిలాండ్, పాకిస్థాన్ మధ్య పోటీ నెలకొంది.
శ్రీలంకపై విజయంతో న్యూజిలాండ్ పాయింట్లు 3 కి చేరడమే కాకుండా, వారి నెట్ రన్ రేట్ (NRR) +3.050 కి పెరిగింది. పాకిస్థాన్ ఖాతాలో కేవలం 1 పాయింట్ ఉండగా, వాళ్ల రన్ రేట్ మైనస్ (-0.461) లో ఉంది. ఇప్పుడు పాకిస్థాన్ సెమీస్ ఆశలన్నీ శుక్రవారం జరిగే ఇంగ్లాండ్ - న్యూజిలాండ్ మ్యాచ్ పైనే ఆధారపడి ఉన్నాయి. ఆ మ్యాచ్‌లో గనుక న్యూజిలాండ్ గెలిస్తే, 5 పాయింట్లతో దర్జాగా సెమీస్ చేరుతుంది పాకిస్థాన్ ఇంటికి వెళ్లాల్సిందే.
పాకిస్థాన్‌కు అవకాశం దక్కాలంటే ముందుగా న్యూజిలాండ్‌ను ఇంగ్లాండ్ ఓడించాలి. ఆ తర్వాత తమ చివరి మ్యాచ్‌లో శ్రీలంకపై పాకిస్థాన్ భారీ తేడాతో విజయం సాధించాలి. న్యూజిలాండ్‌ను ఇంగ్లాండ్ 50 పరుగుల తేడాతో ఓడిస్తే పాకిస్థాన్ తమ మ్యాచ్‌లో శ్రీలంకపై కనీసం 20 పరుగుల తేడాతో గెలవాలి. ఒకవేళ ఛేజింగ్ అయితే 17.5 ఓవర్లలోనే టార్గెట్ పూర్తి చేయాలి.