కరోనా సీజన్ మొదలైనప్పటి నుంచి సోనూసూద్ తన సేవలు కొనసాగిస్తున్నాడు. తొలి విడత కరోనా నుండి ప్రస్తుత రెండవ సీజన్ వరకూ ఏదో విధంగా తన ఉదారతను చాటుకుంటూనే ఉన్నాడు. సెకండ్ వేవ్‌లో ఆక్సిజన్ ప్లాంట్లు నిర్మిస్తూ, అవసరమైన వారికి కాన్సన్ ట్రేటర్లను పంపిస్తూ తన పెద్ద మనసును చాటుకుంటున్నాడు. ఇలా ప్రజల ప్రాణాలను కాపాడుతున్న సోనూసూద్.. చనిపోయిన వ్యక్తుల అంత్యక్రియలు గౌరవప్రదంగా జరిపేందుకు కూడా చేయూతనిస్తున్నాడు.
ఇందుకోసం సోనూసూద్ ముందుగా ఏపీ, తెలంగాణలోని కొన్ని ఎంపిక చేసిన గ్రామాలకు.. మృతదేహాలను భద్రపరిచే డెడ్ బాడీ ఫ్రీజర్ బాక్సులను అందజేస్తున్నారు. రెండు రాష్ట్రాల్లోని సంకిరెడ్డి పల్లి, ఆషాపూర్ బోంకూర్, ఓర్వకల్, మద్దికెర వంటి కొన్ని గ్రామాలను ఎంపిక చేశారు.
అయితే.. ఇటీవల సోనూనూద్ ను ఆయా గ్రామాలకు చెందిన సర్పంచులు కలిశారు. గతంలో గ్రామానికి చెందిన ఓ వ్యక్తి మరణిస్తే.. సంబంధీకులు వచ్చే వరకూ ఫ్రీజర్ బాక్సులో ఉంచేవారమని.. వారు వచ్చాక అంత్యక్రియలు జరిపేవారమని.. ప్రస్తుత పరిస్థితులలో ఫ్రీజర్ బాక్సులు దొరకడం లేదని తమ బాధను సోనూసూద్‌తో చెప్పుకున్నారు. వారి సమస్యను విన్న సోనూసూద్ ఫ్రీజర్ బాక్సులను అందిస్తానని హామీ ఇచ్చారు.