ప్రముఖ గాయని మంగ్లీ ప్రయాణిస్తున్న కారుపై కర్ణాటకలో రాళ్ల దాడి జరిగింది. ఈ సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. బళ్లారి నగరంలో మున్సిపల్ కాలేజి మైదానంలో బళ్లారి ఉత్సవ్ పేరిట వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కన్నడ కంఠీరవ రాజ్ కుమార్ కుటుంబ సభ్యులు కూడా హాజరయ్యారు. బళ్లారి ఉత్సవ్ వేడుకల్లో గాయని మంగ్లీ తన పాటలతో అలరించారు. ఈ కార్యక్రమం నుంచి తిరిగి వస్తుండగా బళ్లారిలో ఆమె కారుపై కొందరు వ్యక్తులు రాళ్లు విసిరారు. ఈ దాడిలో కారు స్వల్పంగా దెబ్బతిన్నట్టు తెలుస్తోంది.
మంగ్లీ మేకప్ టెంట్ లో ఉన్న సమయంలో ఆమెను చూసేందుకు కొందరు యువకులు వచ్చారు. అయితే వారిని పోలీసులు అడ్డుకున్నారు. ఈ ఘటన తర్వాత కొందరు కావాలనే ఈ పని చేశారని తెలుస్తోంది. ఇక చిక్కబళ్లాపూర్ లో జరిగిన కార్యక్రమంలో మంగ్లీ అతికష్టమ్మీద కన్నడలో కొన్ని మాటలు మాట్లాడగా.. అందుకు కూడా విమర్శలు వచ్చాయి. ఈ కారణాల వలనే మంగ్లీ కారుపై రాళ్ల దాడి జరిగి ఉండొచ్చని భావిస్తున్నారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.