మా బిల్డింగ్ అమ్మకం వివాదంపై మరింత క్లారిటీ ఇచ్చిన శివాజీ రాజా
Shivaji Raja Gives Clarity Abovt MAA Building. మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా) ఎన్నికల నేపథ్యంలో పలు విషయాలు బయటకు
By Medi Samrat Published on 9 Sep 2021 1:51 PM GMTమూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా) ఎన్నికల నేపథ్యంలో పలు విషయాలు బయటకు వస్తూనే ఉన్నాయి. సినీనటుడు మోహన్ బాబు మా బిల్డింగ్ గురించి పలు ఆరోపణలు చేశారు. గతంలో 'మా' అధ్యక్షులుగా పనిచేసిన వారు ఎక్కువ ధరకు ఆ భవనాన్ని కొనుగోలు చేసి అతి తక్కువ ధరకు అమ్మేశారని ఆయన విమర్శించారు. మోహన్‌బాబు వ్యాఖ్యలపై నాగబాబు వివరణ ఇచ్చారు.
భవనాన్ని కొనుగోలు చేసిన సమయంలో తానే అధ్యక్షుడిగా ఉన్నానని చెప్పారు. 2006-2008 మధ్య తాను అధ్యక్షుడిగా ఉన్నానని తెలిపారు. అప్పట్లో సినీ ప్రముఖుల సూచనలు, అప్పటి అవసరాలను దృష్టిలో ఉంచుకుని రూ.71.73 లక్షలతో భవనాన్ని కొనుగోలు చేశామని.. ఇంటీరియర్ డిజైన్ కోసం మరో రూ.3 లక్షలు ఖర్చు చేశామని తెలిపారు. తాను 2008లో అధ్యక్ష పదవి నుంచి దిగిపోయిన అనంతరం మా వ్యవహారాల్లో ప్రత్యక్షంగా భాగస్వామిని కాలేదని చెప్పారు. అసోసియేషన్ అభివృద్ధికి కావాల్సిన సలహాలు మాత్రమే ఇచ్చానని అన్నారు. ఆ భవన అమ్మకం వ్యవహారమంతా నరేశ్-శివాజీ రాజాలకే తెలుసని తెలిపారు. అప్పట్లో శివాజీరాజా అధ్యక్షుడిగా ఉన్న సమయంలో నరేశ్ కార్యదర్శిగా ఉన్నారని, ఆ సమయంలో ఆ భవనాన్ని రూ.30 లక్షలకే అమ్మేశారని అన్నారు. ఈ విషయం గురించి నరేశ్‌నే అడగాలని మోహన్ బాబుకు సూచించారు. భవనం అమ్మకం గురించి తనపై వ్యాఖ్యలు చేస్తే మాత్రం తీవ్రంగా స్పందిస్తానని నాగబాబు హెచ్చరించారు.
దీనిపై శివాజీరాజా స్పందించారు. ఆ బిల్డింగ్ అమ్మింది తన హయాంలోనే అని.. అయితే అది బంగ్లా కాదని, డబుల్ బెడ్ రూం ఫ్లాట్ అని.. పైగా అది పెంట్ హౌస్ అని తెలిపారు. "అమ్మకానికి ఫ్లాట్" అంటూ ప్రకటనలు ఇచ్చినా స్పందనలేకపోవడంతో చివరికి 'మా'కు సేవలు అందించిన శ్రీధర్ కు ఆ ఫ్లాట్ అమ్మేశామని వివరించారు. ఆ ఫ్లాట్ కొన్న శ్రీధర్ కూడా ఇప్పుడు ఇబ్బందులు ఎదుర్కొంటున్నాడని శివాజీరాజా తెలిపారు. ఆ పెంట్ హౌస్ ఉన్న అపార్ట్ మెంట్ లోనే దర్శకుల సంఘం, రచయితల సంఘం కార్యాలయాలు కూడా ఉన్నాయని.. సినీ రంగానికి చెందిన కార్యాలయాలు ఉండడంతో తమ కార్యాలయం కూడా అక్కడే ఉంటే బాగుంటుందన్న ఉద్దేశంతో నాగబాబు నాడు ఆ పెంట్ హౌస్ ను కొనుగోలు చేసి ఉండొచ్చని శివాజీరాజా తెలిపారు. నాగబాబు హయాంలో ఎంత నిజాయతీతో ఆ ఫ్లాట్ కొన్నారో, నేను అధ్యక్షుడిగా, నరేశ్ కార్యదర్శిగా ఉన్న సమయంలో అంతే నిజాయతీతో అమ్మేశాం అని తేల్చి చెప్పారు. ఆ ఫ్లాట్ కు సింగిల్ గోడ, కింద మురికి కాలువ వంటి అనేక ప్రతికూలతలు ఉండడంతో అమ్మాలని పలువురు పెద్దలు కూడా సూచించారని తెలిపారు. ఈ విషయంలో ఎవరికైనా సందేహాలు ఉంటే తనను అడగొచ్చని సూచించారు.