తెలుగు చిత్ర పరిశ్రమలో మరో విషాదం చోటు చేసుకుంది. ఒకరి మరణాన్నిజీర్ణించుకోకముందే మరొకరు ఈ లోకాన్ని విడిచివెలుతున్నారు. ప్రముఖ సీనియర్ దర్శకుడు విద్యాసాగర్ రెడ్డి కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన చెన్నైలోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. అయితే.. పరిస్థితి విషమించి గురువారం ఉదయం 6.03గంటలకు తుది శ్వాస విడిచారు. ఆయన ఇక లేరు అనే వార్త తెలుసుకున్న పలువురు సినీ ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా సంతాపం తెలియజేస్తున్నారు.
1952 మార్చి 1న మంగళగిరి వద్ద నిడమర్రు అనే గ్రామంలో విద్యాసాగర్ రెడ్డి జన్మించారు. సినిమాలపై ఆసక్తితో సినీ రంగంలోకి అడుగుపెట్టారు. 'రాకాసి లోయ' అనే చిత్రంతో దర్శకుడిగా పరిచయం అయ్యారు. ఈ చిత్రంలో నరేష్, విజయశాంతి హీరో, హీరోయిన్లుగా నటించారు. ఆ తరువాత 'స్టూవర్టుపురం దొంగలు', 'అమ్మదొంగ', 'రామసక్కనోడు' వంటి బ్లాక్‌బాస్టర్ చిత్రాలను తెరకెక్కించి పరిశ్రమలో తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకున్నారు.
దాదాపు 40 ఏళ్ల సినీ కెరీర్‌లో 30కి పైగా చిత్రాలకు దర్శకత్వం వహించారు. సుమన్ కథానాయకుడిగా తెరకెక్కిన 'రామసక్కనోడు' చిత్రానికి గాను మూడు నంది అవార్డులు అందుకున్నారు. ప్రముఖ దర్శకుడు శ్రీను వైట్ల ఇతని శిష్యుడే.