'సారంగ దరియా' పాట వివాదంపై శేఖర్ కమ్ముల క్లారిటీ ఇచ్చేశాడు..!

Sekhar Kammula Gives Clarity About Saranga Dariya Issue. తాజాగా 'లవ్ స్టోరీ' సినిమాలోని 'సారంగ దరియా' పాటపై నెలకొన్న వివాదంపై ప్రముఖ దర్శకుడు శేఖర్ కమ్ముల స్పందించారు.

By Medi Samrat  Published on  11 March 2021 6:12 AM GMT
Sekhar Kammula Gives Clarity About Saranga Dariya Issue
గత కొంత కాలంగా స్టార్ దర్శకులు, హీరోల చిత్రాలు రిలీజ్ కి ముందే ఎన్నో వివాదాల్లో చిక్కుకుంటున్నాయి. స్టోరీ, మ్యూజిక్, సాంగ్స్ కొన్ని వివాదాస్పద డైలాగ్స్ ఇలా ఒక్కటేమిటి ఎన్నో విషయాల్లో వివాదాలు రాజుకుంటున్నాయి. మొత్తానికి వీటిపై క్లారిటీ తీసుకొని సినిమాలు రిలీజ్ చేస్తున్నారు. తాజాగా 'లవ్ స్టోరీ' సినిమాలోని 'సారంగ దరియా' పాటపై నెలకొన్న వివాదంపై ప్రముఖ దర్శకుడు శేఖర్ కమ్ముల స్పందించారు. 'సారంగ దరియా' సాంగ్ యూట్యూబ్‌లో సెన్సేషన్ అయ్యింది. వారం రోజుల్లోనే 30 మిలియన్లకు పైగా వ్యూస్ వచ్చాయి. పల్లెల్లొ పాడుకునే ఒక తెలంగాణ జానపద గీతాన్ని ఆధునిక హంగులతో సినిమాటిక్‌గా తెరపై చూపించబోతున్నారు.


సుద్దాల అశోక్ తేజ సాహిత్యం, మంగ్లీ గాత్రం, సాయి పల్లవి డాన్స్.. ఇలా ఈ పాటలోని ప్రతీది ప్రత్యేకమే. అయితే, పాటను తానే వెలుగులోకి తీసుకొచ్చానని, తనతో పాడిస్తానని చెప్పి మరొకరితో పాడించారంటూ కోమలి అనే జానపద గాయని ఆరోపించడంతో ఈ పాట చుట్టూ వివాదం నెలకొంది. ఈ నేపథ్యంలో డైరెక్టర్ శేఖర్ కమ్ముల స్పందించారు. అప్పట్లో 'రేలా రే రేలా' ప్రోగ్రాంలో శిరీష అనే అమ్మాయి ఈ పాట పాడిందని, అది ఇప్పటికీ తన మనసులో అలానే ఉండడంతో 'లవ్ స్టోరీ'కి తగ్గట్టుగా పాట రాయాలని సుద్దాల అశోక్ తేజను కోరినట్టు శేఖర్ కమ్ముల చెప్పారు.

అయితే ఆ పాటను శిరీషతో పాడించాలనుకున్నా.. ఆమె గర్భంతో ఉండటంతో కుదరలేదు. దీనికి తోడు కరోనా కారణంగా షూటింగ్ కూడా ఆగిపోయిందని అన్నారు. ఈ పాటను వెలుగులోకి తీసుకొచ్చిన అమ్మాయి కోమలి కావడంతో ఆమెతో పాడిద్దామని సుద్దాల అన్నారని గుర్తు చేశారు. ఆ పాట పాడేందుకు అన్ని ఏర్పాట్లు చేసి ఆమెను రమ్మన్నామని.. కానీ జలుబు, దగ్గు కారణంగా తాను రాలేనని కోమలి చెప్పారని, మరోవైపు పాట రికార్డింగ్ కోసం సంగీత దర్శకుడు అప్పటికే చెన్నై నుంచి రావడంతో తప్పనిసరి పరిస్థితుల్లో మంగ్లీతో పాడించామని వివరించారు. అది వివాదం అవుతుందని తాను ఊహించలేదు.. అయితే తన పేరు వేస్తే అభ్యంతరం లేదని కోమలి చెప్పారని, అయితే, క్రెడిట్‌తో పాటు డబ్బులు కూడా ఇస్తే బాగుంటుందని సుద్దాల సూచించారన్నారు. దీనికి ఆమె కూడా అంగీకరించారన్నారు.

ఈ పాట విషయంలో కోమలికి ఎలాంటి అన్యాయం జరగదని.. ఆడియో ఫంక్షన్‌లో పాడేందుకు కూడా కోమలి అంగీకరించారని, పాట విడుదల చేసినప్పుడు ఆమెకు కృతజ్ఞతలు కూడా చెప్పినట్టు శేఖర్ వివరించారు. ఆమెకు రెమ్యూనరేషన్ ఇవ్వడమే కాదు.. ఆడియో వేడుకకు పిలిచి గౌరవిస్తామని పేర్కొన్నారు. మొత్తానికి ఫ్యామిలీ దర్శకుడు తన మంచి మనసు మరోసారి చాటుకున్నాడు.





Next Story