భీమ్లానాయక్ సినిమా ప్రదర్శన నిలిపివేయడమైనది గమనించగలరు.. ఓ థియేటర్ ముందు ఇలా
Sanghamitra Theater Shuts Down in Andhra Pradesh.పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, రానా దగ్గుబాటి ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన
By తోట వంశీ కుమార్ Published on 25 Feb 2022 10:09 AM ISTపవర్ స్టార్ పవన్ కళ్యాణ్, రానా దగ్గుబాటి ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన చిత్రం 'భీమ్లా నాయక్'. త్రివిక్రమ్ శ్రీనివాస్ మాటలు, స్క్రీన్ ప్లే అందించగా.. సాగర్.కె.చంద్ర దర్శకత్వం వహించారు. ఈ చిత్రంలో పవన్ కళ్యాణ్ సరసన నిత్యా మీనన్, రానా సరసన సంయుక్త మీనన్ నటించారు. ఈ చిత్రం నేడు(శుక్రవారం) ప్రేక్షకుల ముందుకు వచ్చింది. తెలుగు రాష్ట్రాల్లో భీమ్లా నాయక్ సందడి మొదలైంది. తమ అభిమాన నటుడి చిత్రాన్ని చూసేందుకు ఉదయం నుంచే థియేటర్ల వద్దకు అభిమానులు క్యూ కట్టారు. అన్ని సినిమా హాళ్ల దగ్గర భారీ కటౌట్లు ఏర్పాట్లు చేశారు.
ఇక తెలంగాణ రాష్ట్రంలో ఐదో ఆటకు అనుమతి ఇవ్వడంతో పాటు టికెట్ల రేటు పెంచుకునేందుకు వెసులుబాటు కల్పించిన విషయం తెలిసిందే. అయితే.. మరో తెలుగు రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మాత్రం బెనిఫిట్ షోకు ప్రభుత్వం అనుమతి ఇవ్వలేదు. బెనిఫిట్ షోలు వేసినా, ఎక్స్‌ట్రా షోలు వేసినా, ప్రభుత్వం చెప్పిన రేట్ల కంటే ఎక్కువ వసూలు చేసినా కఠిన చర్యలు తప్పవు అంటూ థియేటర్లకు నోటీసులు జారీ చేశారు. దీంతో భీమ్లానాయక్ విడుదలను దృష్టిలో ఉంచుకుని టికెట్ ధరల్లో రాష్ట్ర ప్రభుత్వం తగిన మార్పులు చేస్తుందని బావించిన థియేటర్ల యజమానులకు మరోసారి నిరాశే ఎదురైంది.
కృష్ణా జిల్లా మైలవరంలోని సంఘమిత్ర థియేటర్ యాజమాన్యం 'భీమ్లానాయక్' చిత్ర ప్రదర్శనను నిలిపివేస్తున్నట్లు తెలిపింది. తగ్గించిన టికెట్ ధరలతో సినిమా థియేటర్లను నడపడం కష్టం. దాన్ని దృష్టిలో ఉంచుకుని భీమ్లా నాయక్ చిత్ర ప్రదర్శనను నిలిపివేయడం జరిగింది. గమనించగలరు అని గేటు బయట నోటీసు అంటించారు. పవన్ సినిమా చూద్దామని ఎంతో ఆశతో థియేటర్‌కు వచ్చిన పలువురు అభిమానులు నోటీసును చూసి నిరాశ చెందారు.