ఆంధ్రప్రదేశ్‌లో సినిమా టికెట్ ధరలపై ప్రముఖ దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ మరోసారి ట్విటర్ వేదికగా స్పందించారు. మహారాష్ట్రలో 'ఆర్‌ఆర్‌ఆర్' టికెట్ల ధర రూ.2,200 వరకు, ఆంధ్రప్రదేశ్‌లో మాత్రం రూ.200కు కూడా అమ్ముకోవడానికి అనుమతుల్లేవు అంటూ ఆర్జీవీ ప్రశ్నించారు. ఏపీలో సినిమా టికెట్ ధరలపై పరిణామాలను చూస్తుంటే బాహుబలిని కట్టప్ప ఎందుకు చంపాడనే ప్రశ్న ఉత్పన్నమవుతోందని ఆర్జీవీ వ్యాఖ్యనించారు. ఐనాక్స్ మల్టీప్లెక్స్‌లలో రూ.2,200 వరకు సినిమా టికెట్లు విక్రయిస్తున్నారని ఆర్జీవీ అన్నారు.
ఇక నిన్న ఏపీ సినిమాటోగ్రఫీ మంత్రి పేర్ని నానితో ఆర్జీవీ భేటీ అయ్యారు. ప్రధానంగా వారు సినిమా టికెట్ల ధరలపై చర్చించారు. గత కొన్ని రోజులుగా ఏపీలో సినిమా టికెట్ ధరలపై విషయం వివాదం నడుస్తోంది. ప్రభుత్వం నిర్ణయించిన ధరలతో థియేటర్లు నడిపేందుకు యాజమాన్యలు వెనకడుగు వేస్తున్నాయి. ఇప్పటికే చాలా థియేటర్లను తాత్కాలికంగా మూసివేశారు. అంతకుముందు టాలీవుడ్ హీరోలు నాని, సిద్ధార్థ్ టికెట్ ధరలపై స్పందించారు. కానీ నాగార్జున, చిరంజీవి, మోహన్ బాబు వంటి సీనియర్ హీరోలు మాత్రం.. సినిమా టికెట్ ధరలపై స్పందించలేదు.