బాలీవుడ్ రొమాంటిక్ హీరోకు బ్రెయిన్ స్ట్రోక్.. కార్గిల్ షూటింగ్‌లో ఉండగా..
Rahul Roy hospitalised after suffering brain stroke. బాలీవుడ్‌ను వరుస విషాదాలు వెంటాడుతూనే ఉన్నాయి. తాజాగా మరో నటుడు
By Medi Samrat Published on 30 Nov 2020 4:43 AM GMT
బాలీవుడ్‌ను వరుస విషాదాలు వెంటాడుతూనే ఉన్నాయి. తాజాగా మరో నటుడు తీవ్ర అస్వస్తతకు గురయ్యాడు. 1990లో మహేష్ భట్ దర్శకుడిగా తెరకెక్కిన సూపర్ హిట్ సినిమా ఆషికి. ఆ సినిమాతో హీరోగా పరిచయమై తొలి సినిమాతోనే రొమాంటిక్ హీరోగా గుర్తింపు తెచ్చుకున్న రాహుల్ రాయ్ ప్రస్తుతం ఐసీయూలో ఉన్నాడు. 22 ఏళ్లకే బాలీవుడ్‌లో అరంగేట్రం చేసిన రాహుల్ రాయ్ ఆషికితో మంచి గుర్తింపు సంపాదించుకున్నాడు. అయితే ఆ సినిమా తర్వాత పలు సినిమాల్లో నటించినా అదే గుర్తింపును ఆయన కొనసాగించలేకపోయారు.
ఇదిలావుంటే.. తాజాగా ఈయన 'ఎల్ఏసీ' సినిమా చిత్రీకరణలో పాల్గొంటున్న సమయంలోనే బ్రెయిన్ స్ట్రోక్‌కు గురయ్యారు. ప్రస్తుతం కార్గిల్‌లో ఉన్న వాతావరణం కారణంగా రాహుల్ రాయ్‌కు బ్రెయిన్ స్ట్రోక్ వచ్చిందని వైద్యులు తెలిపారు. దాంతో వెంటనే షూటింగ్ నిలిపేశారు. అక్కడ్నుంచి రెండు రోజుల కిందటే రాహుల్ రాయ్‌ను ముంబై తరలించి ఆస్పత్రిలో చేర్చారు. ప్రస్తుతం ఈయన ఐసీయూలో చికిత్స పొందుతున్నాడు.
రాహుల్ రాయ్ సోదరుడు రోహిత్ రాయ్ ఈ విషయమై వివరాలను మీడియాకు వెల్లడించాడు. అయితే కంగారు పడాల్సిన పనేం లేదని.. కోలుకుంటున్నట్లుగా తెలిపాడు. ఇప్పుడిప్పుడే ఆయన స్పృహలోకి వస్తున్నట్లు చెప్పాడు.