ఎంపీగా గెలిచే సత్తా ఉంది.. కానీ.. : దిల్ రాజు
Producer Dil Raju Key Comments on Telugu Film Chamber of Commerce elections. ప్రముఖ నిర్మాత దిల్ రాజు తెలుగు ఫిల్మ్ చాంబర్ ఆఫ్ కామర్స్ ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు.
By Medi Samrat Published on 29 July 2023 7:15 PM IST
ప్రముఖ నిర్మాత దిల్ రాజు తెలుగు ఫిల్మ్ చాంబర్ ఆఫ్ కామర్స్ ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు. జులై 30న పోలింగ్ జరగనున్న నేపథ్యంలో దిల్ రాజు తన ప్యానెల్ తో కలిసి మీడియా ముందుకు వచ్చారు. ఆయన మాట్లాడుతూ, ఫిల్మ్ చాంబర్ ఎన్నికల్లో పోటీ చేయడం తన ఇంట్లో కానీ, తన ఆఫీసులో వాళ్లకి కానీ ఇష్టం లేదని అన్నారు. సీనియర్లు ఎవరూ ముందుకు రాకపోవడంతో తాను బరిలో దిగుతున్నానని, సభ్యుల కోసమే తాను ఎన్నికల్లో పాల్గొంటున్నట్టు వెల్లడించారు. తాము గెలిస్తే ఫిల్మ్ చాంబర్ ను మరింత బలోపేతం చేస్తామని దిల్ రాజు తెలిపారు. టాలీవుడ్ చిత్ర పరిశ్రమ బాగుండాలని కోరుకునేవాళ్లు దిల్ రాజు కావాలో, వద్దో ఆలోచించుకోవాలని పిలుపునిచ్చారు.
సినీ రంగంలో ప్రధానంగా నాలుగు విభాగాల్లో సమస్యలను గుర్తించామన్నారు. నిర్మాతలకు, ఎగ్జిబిటర్స్ కు కష్టాలు పెరిగాయి. ఫిల్మ్ చాంబర్ రాజ్యాంగంలో మార్పులు జరాగాలని కోరుకుంటున్నామన్నారు. 50 ఏళ్ల నాటి బైలాస్ ను మార్చాల్సిన అవసరం ఉంది. బైలాస్ ను మార్చితే ముందు తరాల వారికి ఇబ్బంది లేకుండా ఉంటుందన్నారు. చాంబర్ లో 1500 మంది సభ్యులు నమోదై ఉన్నారని.. కానీ వారిలో క్రియాశీలకంగా ఉంటోంది 150 మందే అని అన్నారు. గడచిన మూడేళ్లలో సినిమాలు తీసినవారే చాంబర్ లో ఉండాలన్నది మా ప్రతిపాదన అన్నారు. దానికి కొందరు ఒప్పుకోవడంలేదని తెలిపారు. అంతేకాదు, తాను ఏ రాజకీయ పార్టీలో అడుగుపెట్టినా ఎంపీగా గెలిచే సత్తా ఉందని, తెలుగు చలనచిత్ర పరిశ్రమకే తన ప్రాధాన్యం అని స్పష్టం చేశారు. తెలుగు ఫిల్మ్ చాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్ష పదవికి దిల్ రాజు, సి.కల్యాణ్ పోటీ పడుతున్నారు. ఆదివారం ఉదయం 8 గంటలకు పోలింగ్ ప్రారంభం కానుంది. మధ్యాహ్నం 3 గంటల వరకు ఓటింగ్ కు అవకాశం ఉంటుంది. సాయంత్రం 4 గంటల నుంచి ఓట్ల లెక్కింపు ప్రారంభించి, సాయంత్రం 6 గంటలకు ఫలితాలు వెల్లడించనున్నారు.