ఓటమి బాధ.. సంచలన నిర్ణయం తీసుకున్న ప్రకాష్ రాజ్
Prakash Raj Resigns For MAA Membership. మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా) అధ్యక్షుడిగా మంచు విష్ణు ఎన్నికయ్యారు. ప్రకాశ్‌రాజ్‌పై
By Medi Samrat Published on 11 Oct 2021 11:52 AM ISTమూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా) అధ్యక్షుడిగా మంచు విష్ణు ఎన్నికయ్యారు. ప్రకాశ్‌రాజ్‌పై మంచు విష్ణు 107 ఓట్ల తేడాతో విజయం సాధించారు. విష్ణుకు 381 ఓట్లు రాగా, ప్రకాశ్‌రాజ్‌కు 274 ఓట్లు పోలయ్యాయి. మా అసోసియేషన్‌లో మొత్తం 883 మందికి ఓటు హక్కు ఉండగా, ఈసారి రికార్డు స్థాయిలో 665 మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు. ప్రధాన కార్యదర్శి పదవి కోసం ప్రకాశ్ రాజ్ ప్యానల్ నుంచి పోటీ పడిన జీవితా రాజశేఖర్ 27 ఓట్ల తేడాతో రఘుబాబు చేతిలో ఓటమి పాలయ్యారు. మాదాల రవి మంచు విష్ణు ప్యానల్ నుంచి ఉపాధ్యక్షుడిగా గెలుపొందారు. ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ కోసం ప్రకాశ్ రాజ్ ప్యానల్ నుంచి పోటీపడిన శ్రీకాంత్.. బాబూమోహన్‌పై 106 ఓట్ల తేడాతో గెలుపొందారు.
మంచు ప్యానల్ మొదటి నుండి ప్రకాష్ రాజ్ ను నాన్ లోకల్ అంటూ విమర్శలు గుప్పిస్తూ వచ్చింది. అదే ఆయన ఓటమికి ముఖ్య కారణమని కూడా అంటున్నారు. దీంతో ప్రకాష్ రాజ్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ సభ్యత్వానికి ప్రకాశ్ రాజ్ రాజీనామా చేశారు. ఎన్నికల నేపథ్యంలో తనను నాన్ లోకల్ అంటూ, తెలుగువాడు కాదంటూ చేసిన వ్యాఖ్యలను మీడియా సమావేశంలో ప్రస్తావించారు. ప్రాంతీయ వాదం తెరపైకి వచ్చిందని.. విశ్లేషించాల్సింది చాలా ఉందని, దానిపై చర్చిస్తానని ప్రకాశ్ రాజ్ చెప్పుకొచ్చారు. మా ఎన్నికల్లో చాలా మంది ఓటు హక్కును వినియోగించుకున్నారని, వారందరికీ కృతజ్ఞతలు చెబుతున్నానని అన్నారు. ఈ ఎన్నికలు ప్రాంతీయ, జాతీయవాదం భావోద్వేగాల మధ్య జరిగాయని చెప్పుకొచ్చారు.
తెలుగు బిడ్డను మా అధ్యక్షుడిగా ఎన్నుకున్నారని చెప్పారు. తాను తెలుగు బిడ్డను కాదని.. మా ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నానని ప్రకాశ్ రాజ్ అన్నారు. తన తల్లిదండ్రులు తెలుగువారు కాదని, అది వారి తప్పు కాదని, తన తప్పు కూడా కాదని అన్నారు. తెలుగు వ్యక్తినే ఓటర్లు ఎన్నుకున్నారని తెలిపారు. అతడు మంచి వ్యక్తేనని అన్నారు. అయితే, తనకు ఆత్మగౌరవం ఉంటుందని అందుకే మాకు రాజీనామా చేస్తున్నానని తెలిపారు. తనకు, ప్రేక్షకులను మధ్య అనుబంధం మాత్రం కొనసాగుతుందని చెప్పారు.